వీరు ఐఎస్ఐఎస్, తాలిబన్ల ప్రచారకర్తలు: మీనాక్షి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్ ఇద్దరూ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల ప్రచారకర్తలుగా మాట్లాడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి మండిపడ్డారు.
న్యూఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ వీరిద్దరి మాటలు వింటుంటే భారత్ ప్రజల గురించి ఆలోచించడం లేదని, ఐఎస్ఐఎస్, తాలిబన్ల కోసం ఆలోచిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నదని ఆమె గుర్తు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదుల నిర్మూలణ కోసం తీసుకున్న నిర్ణయానికి ప్రపంచంలోని అగ్రదేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. ప్యారిస్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడులలో 129 మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని మీనాక్షి లేఖి అన్నారు.

అదే విదంగా 350 మంది వరకు గాయపడ్డారని చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులకు ఈ విషయాలు పట్టనట్లు ఉందని మండిపడ్డారు. భారత్- పాక్ ల మద్య చర్చలు జరగాలంటే వెంటనే మోడీని ఆ పదవి నుంచి తొలగించి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలని మణిశంకర్ అయ్యర్ చెప్పడం సిగ్గు చేటు అన్నారు.
అదీ ఓ పాకిస్థానీ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేసి భారత్ పరువు తీశారని ఆమె మండిపడ్డారు. అదే విదంగా విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సైతం గత వారంలో పాకిస్థాన్ వెళ్లి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని విరుచుకుపడ్డారు.
పాకిస్థాన్ లోని జిన్నా ఇన్ స్టిట్యూట్ లో సల్మాన్ ఖుర్షీద్ చేసిన ప్రసంగంలో నరేంద్ర మోడీ తనను ఆరాధించే వారితో ఎక్కువగా మాట్లాడతారని, మిగిలిన వారి గురించి పట్టించుకోరని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వీరిద్దరూ ఐఎస్ఐఎస్, తాలిబన్ల ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారని మీనాక్షి లేఖి ఆరోపించారు.












Click it and Unblock the Notifications