వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ బౌన్సర్‌తో యెడ్యూరప్పకు ‘లింగాయత్’ కష్టాలు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: సాధారణంగా బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తుంటాయి కానీ, ఆ అస్ర్తాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రయోగించింది. లింగాయత్‌లకు మైనార్టీ మత హోదా నిర్ణయం కర్ణాటకలో ఎన్నికలవేళ రాజకీయ వేడిని అమాంతం పెంచేసింది. రెండు రోజుల క్రితం ప్రత్యేక జెండాతో దర్శనమిచ్చిన రాష్ట్రం.. తాజా నిర్ణయంతో దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నది.రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17%. లింగాయత్‌లు తమ వెంటే ఉన్నారని బీజేపీ నమ్ముతూ వచ్చింది. కానీ, సిద్ధరామయ్య మైనార్టీ హోదా అస్ర్తాన్ని ప్రయోగించడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని లింగాయత్‌లు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నాగమోహన్‌దాస్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసులనే కర్ణాటక కేబినెట్ ఆమోదించినట్లు కనిపిస్తున్నా, గణనీయంగా ఉన్న లింగాయత్‌ల ఓట్లను కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ ఈ బ్రహ్మాస్ర్తాన్ని ప్రయోగించినట్లు తెలుస్తున్నది. లింగాయత్‌లకు మత పరమైన హోదాపై వచ్చేవారం కర్ణాటక ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ జారీ చేయవచ్చునని, కేంద్రానికీ కూడా అధికారికంగా సిఫారసు చేయనుందని భావిస్తున్నారు.

 100 స్థానాల్లో గెలుపొటములను నిర్ణయించేది లింగాయత్‌లే

100 స్థానాల్లో గెలుపొటములను నిర్ణయించేది లింగాయత్‌లే

ఉత్తర కర్ణాటకలో బలమైన ఈ వర్గం తొలినుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నది. కర్ణాటక రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం. ఉంటారు. బీజేపీ నేత, రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప సామాజిక వర్గ నేతే. 224 అసెంబ్లీ సెగ్మెంట్లలో 100 స్థానాల్లో లింగాయత్‌లు గెలుపును ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఓటుబ్యాంకును చీల్చడంతోపాటు ఎన్నికల వేళ లింగాయత్‌ల మైనారిటీ మత హోదాలో వీరశైవులను కలుపడం కూడా కాంగ్రెస్ పార్టీకి భారీగా లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలువురు మంత్రులు బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించి, సీఎం సిద్ధరామయ్యను సన్మానించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నిర్ణయంతో వీలైనంత ఎక్కువ లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ వ్యూహం. బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టివేసి తమ డిమాండ్‌కు బీజేపీయే అడ్డుపడుతుందన్న అభిప్రాయాన్ని లింగాయత్‌లలో కలిగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కాకపోతే కర్ణాటక క్యాబినెట్ నిర్ణయాన్ని వీరశైవులు విభేదిస్తుండడం కాంగ్రెస్‌ను కలవరపరుస్తున్నది.

బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి

బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడుమీదున్న బీజేపీని సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయం చిక్కుల్లో పడేసింది. లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించడాన్ని అంగీకరించబోమని బీజేపీ మాత్రు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టంచేసింది. లింగాయత్‌లు పూజించే శివుడు, శివ లింగం హిందూ మత దైవాలేనని ఆరెస్సెస్ భావన. హిందూ మతాన్ని చీల్చడానికి, మత విద్వేషాలు రగల్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఇప్పటికే సంఘ్ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఎలా స్పందించాలో తెలియనిస్థితిలో బీజేపీ పడిపోయింది. ‘మైనారిటీ మత హోదా కల్పించొద్దని చెబితే రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉన్న లింగాయత్‌ల మద్దతు కోల్పోతాం. ఒకే అని చెబితే ఆరెస్సెస్‌కు నచ్చదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు' అని మాజీ సీఎం యెడ్యూరప్ప సన్నిహితుడు ఒకరు వాపోయారు. లింగాయత్‌లు, వీరశైవుల మధ్య విభేదాలను ఎత్తిచూపుతూ.. సిద్దరామయ్య ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. లింగాయత్‌లు, వీర శైవులు ఒక్కటేనని.. వారి ఐక్యతకు కాం‌గ్రెస్ ముప్పుతెస్తున్నదని బీజేపీ సీఎం అభ్యర్థి, మాజీ సీఎం బీఎస్ యెడ్యూరప్ప ఆరోపించారు.

 ఉత్తర, మధ్య కర్ణాటకల్లో లింగాయత్‌ల ఆధిపత్యం?

ఉత్తర, మధ్య కర్ణాటకల్లో లింగాయత్‌ల ఆధిపత్యం?

12వ శతాబ్ద సంఘ సంస్కర్త బసవేశ్వరుడి అనుచరులే లింగాయత్‌లు. బ్రాహ్మణ, కుల ఆధిపత్యంపై సామాజిక, ఆధ్యాత్మిక తిరుగుబాటుకు మార్గ నిర్దేశం చేసిన బసవేశ్వరుడు.. కన్నడ సరళ పదాలతో వచన తత్వాలను రచించారు. జన్మతా కాకుండా చేస్తున్న పనుల ఆధారంగా మనుషుల వర్గీకరణ ఉండాలని వీరు నమ్ముతారు. వారి నమ్మకాలు, ఆచారాలు, పద్దతులన్నీ హిందూ సమాజానికి భిన్నంగా ఉంటాయి. మహిళలను పురుషులతో సమానంగా చూడాలని బోధించారు. వారి నమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు అన్నీ హిందూ సమాజానికి భిన్నంగా ఉంటాయి. ఉత్తర, మధ్య కర్ణాటకలో లింగాయత్‌ల ఆధిపత్యం ఎక్కువ. ఇక కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌ల్లో వీరు విస్తరించి ఉన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోనూ వీరి సంతతి ఉన్నది.

వీర శైవుల్లో 92 రకాల ఉప కులాలు

వీర శైవుల్లో 92 రకాల ఉప కులాలు

లింగాయత్‌లలోనే వీరశైవ వర్గం హిందువులు పూజించే శివుడిని ఆరాధిస్తుంది. బసవన్న తన తత్వాల్లో పేర్కొన్న శివుడు హిందూ దేవుడు కాదని, అది ఇష్ట లింగం (నిరాకార స్వరూపం) అని లింగాయత్‌ల వాదన. వారు తమ మెడలో ధరించేది కూడా ఆ ఇష్ట లింగమేనని చెబుతుంటారు. వీర శైవులు మాత్రం శివుడిని తప్ప మరే దేవుడినీ ఆరాధించరు. వీర శైవ మూలాలు హిందూ వేదాలు, పురాణాలు, ఆగమ శాస్త్రాల్లో ఉన్నాయి. వీర శైవులు పంచ మఠాలను అనుసరిస్తారు. కాశీ, రామేశ్వరం, ఉజ్జయిని, శ్రీశైలం, రంభాపుర మఠాలు ఉన్నాయి. ఇవకే వారికి ప్రధాన దర్శనీయ స్థలాలు కూడా. ఈ మఠాలకు చెందిన ఐదుగురు పీఠాధిపతులను ‘పంచరాయలు' అని అంటారు. లింగాయత్‌లు, వీర శైవుల్లో మొత్తం 92 రకాలైన ఉప కులాలు ఉండటం గమనార్హం.

వీర శైవుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న లింగాయత్‌లు

వీర శైవుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న లింగాయత్‌లు

లింగాయత్‌లకే మైనార్టీ మత హోదా ఇస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని వీరశైవ పంచపీఠాధిపతులు తొలినుంచీ చెబుతున్నారు. తమను లింగాయత్‌లతో సమానంగా గుర్తించాలని వాదిస్తున్నారు. తాము హిందూ మతానికి చెందిన వారం కాదని, వీర శైవులు హిందూ మత మూలాలు ఉన్న వారని లింగాయత్‌లు పేర్కొనడంపైనా మొదటి నుంచి వివాదం నెలకొంది. బసవేశ్వరుడు వ్యతిరేకించిన వైదిక కర్మలను వీర శైవులు నిర్వహిస్తుంటారని, గురు పీఠాలను అనుసరిస్తున్నారని లింగాయత్‌లు విమర్శిస్తున్నారు. తమలో అంతర్భాగంగా ఉంటూ రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న వీరశైవుల ఆధిపత్యాన్ని లింగాయత్‌లు వ్యతిరేకిస్తున్నారు. తాము లింగాయత్‌లు ఒక్కటేనని వీరశైవులు చెబుతున్నారు.

23న తుది నిర్ణయం తీసుకుంటామన్న వీర శైవ మహాసభ

23న తుది నిర్ణయం తీసుకుంటామన్న వీర శైవ మహాసభ

కాగా, ప్రభుత్వం కొత్తగా గుర్తించే మతాన్ని వీరశైవ లింగాయత్‌గా పిలువాలని వీరశైవులు డిమాండ్ చేస్తున్నారు. నిపుణుల కమిటీ మాత్రం లింగాయత్‌ అని పేర్కొనాలని స్పష్టంచేసింది. కాగా, కర్ణాటక కేబినెట్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు అఖిల భారత వీరశైవ మహాసభ స్పష్టంచేసింది. తమ డిమాండ్‌కు తలొగ్గకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని ఒక దశలో కొందరు వీర శైవులు హెచ్చరించారు కూడా. ఏకంగా సిద్ధరామయ్య మంత్రివర్గంలో సభ్యుడు ఎంపీ పాటిల్.. లింగాయత్ అని ఉండాలని వాదిస్తున్నారు. ఎమ్మెల్యే శామనూర్ శివ శంకరప్ప ‘వీర శైవ లింగాయత్' అని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్‌లతో సమానంగా వీరశైవానికీ మత హోదా ఇవ్వాలని మహాసభ అధ్యక్షుడు షమనూర్ శివశంకరప్ప డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 23న సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇన్ని తలనొప్పుల మధ్య సిద్ధ రామయ్య సర్కార్ వివిధ దశల్లో చర్చలు జరిపి, చివరకు లింగాయత్ సామాజిక వర్గంలోనే వీర శైవుల్ని ఉప వర్గంగా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నది.

 రిజర్వేషన్లు కోల్పోతారు: కేంద్రమంత్రి

రిజర్వేషన్లు కోల్పోతారు: కేంద్రమంత్రి

లింగాయత్, వీరశైవులకు మైనార్టీ మత హోదా ఇవ్వాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కేంద్రం ఆచితూచి స్పందిస్తున్నది. కర్ణాటక నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కర్ణాటక మైనారిటీ కమిషన్ చైర్మన్ హెచ్‌ఎన్ నాగమోహన్‌దాస్ కమిషన్ నివేదిక ఆధారంగా సిద్దరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన పరిశీలనకు జనగణన రిజిస్ట్రార్ జనరల్‌ను హోం శాఖ అధికారులు పంపనున్నారు. ఆయన సలహాలను తీసుకున్నాక కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానున్నది. లింగాయత్‌లకు మైనారిటీ మత హోదా వల్ల అందులోని ఎస్సీలు తమ రిజర్వేషన్ కోల్పోతారని కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ తెలిపారు. అందుకే 2013లో ఈ ప్రతిపాదన కేంద్రం ముందు కొచ్చినా యూపీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు.

 ఇలా లింగాయత్‌లకు పెరుగనున్న రిజర్వేషన్ శాతం

ఇలా లింగాయత్‌లకు పెరుగనున్న రిజర్వేషన్ శాతం

మైనారిటీ మత హోదాను కేంద్రం అంగీకరించే వరకు కర్ణాటకలో విద్య, ఉద్యోగ రంగాల రిజర్వేషన్లలో ఎటువంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం లింగాయత్‌లోని వివిధ ఉప కులాలు.. బీసీ కేటగిరి - 2ఏ, 3బీల్లో 15 శాతం రిజర్వేషన్ పొందుతున్నాయి. మత హోదాకు కేంద్రం ఆమోదం తెలిపితే ఈ రిజర్వేషన్ శాతం పెరుగనున్నది. విద్యా ఉద్యోగాల్లో అదనపు ప్రయోజనాలు పొందుతారు. ఉత్తర కర్ణాటకలో అత్యధిక విద్యా సంస్థలను లింగాయత్‌లే నిర్వహిస్తున్నారు. మైనారిటీ హోదాతో వారికి అదనపు మినహాయింపులు లభిస్తాయి. రాజ్యాంగంలోని 25 సీ సెక్షన్ ప్రకారం పేర్కొన్న మత ఆచారాలు, ప్రచారానికి సంబంధించిన స్వేచ్చ పొందుతారు. సెక్షన్ 28 ప్రకారం విద్యాసంస్థల్లో మతారాధన చేపట్టవచ్చు. అన్నింటిని మించి సెక్షన్ 29 ప్రకారం మైనారిటీల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. సెక్షన్ 20 ప్రకారం మత పరమైన విద్యా సంస్థల్నీ నెలకొల్పుకునే స్వేచ్ఛ దక్కుతుంది.

 దేశ జనాభాలో జైనులు 0.4 శాతం మాత్రమే

దేశ జనాభాలో జైనులు 0.4 శాతం మాత్రమే

దేశ జనాభాలో 0.4 శాతంగా ఉన్న జైనులకు జాతీయ స్థాయిలో మైనారిటీ మత హోదా కల్పిస్తూ 2014 జనవరి 20వ తేదీన అప్పటి యూపీఏ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీల తర్వాత మైనారిటీ హోదా పొందిన వారు జైనులే. కేంద్రం నిర్ణయానికి ముందే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జైనులు మైనారిటీ హోదాను పొందారు. 2005లో జైనులకు మైనారిటీ మత హోదా కల్పించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికి వదిలేసింది. 2014 గణాంకాల ప్రకారం భారతదేశంలో జైనుల జనాభా 50 లక్షల పై చిలుకు ఉన్నది. 2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జైనులకు మైనారిటీ మత హోదా కల్పించిందన్న విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.

English summary
BENGALURU: The Siddaramaiah government's move to give religious minority status to the politically powerful Lingayat community in Karnataka has run into trouble. The key socio religious body of the Veershavai-Lingayats, the Veershavai Lingayat Mahasabha, has objected to the move, hinting that it would lead to divisiveness in society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X