వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తిమీర: భారతదేశపు వంటల్లో మకుటం లేని మహారాణి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కొత్తిమిర

భారతదేశపు పోపుల డబ్బలోకి ఒకసారి తొంగి చూడండి. అందులో మూడు అగ్రస్థాయి పోపు దినుసులు – పసుపు, కారం, ధనియాల పొడి (ఎక్కువగా జీలకర్ర కూడా కలిపి ఉంటుంది) మీకు కనిపించవచ్చు. చాలా కూరలు, పప్పులు, వంటకాల్లో ప్రధానమైన దినుసులు ఇవి. ఈ మూడింటిలోనూ ధనియాల పొడికి పసుపు లాగా కొట్టొచ్చినట్లుగా రంగు ఉండదు. కారం లాగా మంట ఉండదు. కానీ ఈ పోపు దినుసుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి బహుశా ధనియాలే కావచ్చు.

గరుకుగా ఉండే ధనియాల పొడి.. చాలా వంటకాలకు గాఢతను, గింజల తరహా రుచిని ఇస్తుంది. మెత్తగా చేసిన ధనియాల పొడిని కూరలకు చిక్కదనం తేవటానికి ఉపయోగిస్తారు. ఇక.. కొత్తిమీర తాజా కాడలు, ఆకులను వంటలకు సువాసన ఇవ్వటానికి, కొసమెరుపు రుచి కోసం వాడతారు.

భారతదేశపు వంటల్లో కొత్తిమీర వాడటం ఎంతటి సంప్రదాయమంటే.. తోపుడు బండ్ల మీద కూరగాయలు అమ్మేవాళ్లు వినియోగదారుల కూరల సంచిలో తాజా కొత్తిమిర కట్ట ఒకటి (పిడికెడు పచ్చి మిరపకాయలు కూడా) కాంప్లిమెంటరీగా పడేయటం ఆనవాయితీ అయిపోయింది. భారతీయ వంటకాల్లో సర్వాంతర్యామిగా కనిపించే కొత్తిమీర నిజంగా మహారాణి అవుతుంది. కాకపోతే మకుటం లేని మహారాణి ఇది.

అయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కొత్తిమీర ఆకుల మీద అయిష్టత చాలా బలంగానే ఉంది. ఈ వ్యతిరేకతకే అంకితమైన సోషల్ మీడియా కమ్యూనిటీలు కూడా ఉన్నాయి. అవి కొత్తిమీరను ఎండగడుతూ ప్రచారం చేయటంలో చాలా శ్రద్ధ పెడతాయి. అసలు దీనిపట్ల తమ ద్వేషాన్ని ప్రతి ఏటా స్మరించుకుని, చాటి చెప్పటానికి అంతర్జాతీయ దినం కూడా ఒకటుంది. 'ఐ హేట్ కొరియాండర్ డే’ అని పిలిచే ఆ రోజు ఫిబ్రవరి 24.

కొత్తిమీరను ఇష్టపడే వారు అది తాజాగా, సువాసననిచ్చే, కాస్త పులుపు రుచిగల ఆకుగా అభివర్ణిస్తారు. దీనిని ద్వేషించేవాళ్లు.. ఈ ఆకు రుచి సబ్బులాగా, మట్టి లాగా లేదా పురుగుల్లాగా ఉంటుందని చెప్తారు. అసలు కొత్తిమీరకు కొరియాండర్ అనే ఆంగ్ల పదం గ్రీకు పదమైన 'కొరిస్’ నుంచి వచ్చిందని.. కొరిస్ అంటే గ్రీకులో 'నల్లి’ అని అర్థమని, కొత్తిమీర వాసన నల్లి వాసనలాగా ఉంటుంది కాబట్టే దానికి కొరియాండర్ అనే పేరు వచ్చిందని కూడా ఉటంకిస్తుంటారు.

ఒక రకమైన జన్యువు వల్ల కొత్తిమీర పట్ల వికర్షణ వారసత్వంగా వచ్చి ఉండవచ్చునని, అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా దీనిపట్ల విముఖత కనిపిస్తుందని ఓ పరిశోధన చెప్తోంది. అయితే.. దక్షిణాసియా వాసులు చిన్నతనం నుంచే దీని బలమైన రుచి, వాసనలకు అలవాటు పడటం వల్ల కొత్తిమీర పట్ల వికర్షణ తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

పోపు దినుసుల డబ్బా

దక్షిణాసియా వాసులకు కొత్తిమీర అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ.

వండటం పూర్తయ్యాక చివర్లో ఆలోచన వచ్చి ఆ వంటకం మీద గంపెడంత కొత్తిమీర పడేయటం.. పశ్చిమ దేశాలకు 'ఎగుమతైన’ టిక్కా మసాలా వంటి భారతీయ వంటకాల మూస నమూనాగా చెప్తారు. కానీ దక్షిణాసియా వాసులు అలా కాదు. చాలా వంటకాల్లో వాటిని వండేటపుడు వేర్వేరు సమయాల్లో కావాలనే ధనియాల పొడి, కొత్తిమీర వాడుతుంటారు.

కూర చేసేటపుడు పసుపు, జీలకర్రతో పాటు ధనియాల పొడి కూడా వేయటం ఆనవాయితీ. ఇది ఆ కూరలో రసాన్ని చిక్కబరుస్తుంది. తెలిసీతెలియనట్లుగా ఉండే చిన్న పులుపు రుచిని ఇస్తుంది. వేడి నూనెతో మసాలా దినుసులు వేయించి వంటకాలకు పెట్టే తాలింపులో కూడా ధనియాలు వాడవచ్చు. అది ఆ కూరలకు విశిష్టమైన రుచిని ఇస్తుంది.

ఇక కొత్తిమీర ఆకులతో పచ్చడి చేస్తారు. ఆకులను సన్నగా తరిగి పెరుగు పచ్చడి, మజ్జిగ చారులో పలుచగా కలుపుతారు. తాజా కొత్తిమీర ఆకులను కోసి పూర్తి చేసిన వంటల మీద సుతారంగా చిలకరిస్తారు. దానితో ఆ వంటకానికి తుది రుచి, రూపం వస్తుంది.

అయితే.. భారతీయ వంటకాల్లో కొత్తిమీర ఇప్పటికీ ఇంతగా అల్లుకుపోయి ఉన్నాకూడా.. ఈ వంటల్లో దీని ప్రాధాన్యతను పెద్దగా గుర్తించరు. ఎందుకంటే అది చాలా చౌకగా, ఎక్కడైనా, ఎప్పుడైనా దొరుకుతుంది. అందరికీ అందుబాటులో ఉంటుంది. అన్ని కూరల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఉంటుంది. అందువల్ల దీనిని తేలికగా తీసుకుంటారు.

దీనిని మార్చాలని రణ్‌వీర్ బ్రార్ అనే చెఫ్ ప్రయత్నిస్తున్నారు.

''మా పంజాబీ కుటుంబంలో చిన్నప్పటి నుంచీ మేం తినే ప్రతిదాంట్లో కొత్తిమీర చాలా ముఖ్యమైన భాగం. కాలువల దగ్గర మేం ధనియాలు చల్లుతాం. అవి అక్కడ మొలుస్తాయి. కాస్త పిలకలు వేశాక వాటిని పీకి మా కూరల్లో పడేస్తాం’’ అని ఆయన చెప్పారు. రణ్‌వీర్ బ్రార్ వంటల మీద పుస్తకాలు రాశారు. రెస్టారెంట్ నడుపుతున్నారు. మాస్టర్‌చెఫ్ ఇండియాలో జడ్జిగా కూడా ఉన్నారు.

భారతీయ వంటకాల్లో మరింత లోతుగా మునిగి, దేశమంతా విస్తృతంగా ప్రయాణించిన రణ్‌బీర్.. దేశంలోని ప్రాంతీయ వంటకాల్లో కొత్తిమీరను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో తెలుసుకుని దానిని అభిమానించటం మొదలుపెట్టారు.

కొత్తిమిరను భారతదేశపు ‘జాతీయ ఓషధి మొక్క’గా చేయాలని చెఫ్ రణ్‌వీర్ బ్రార్ కోరుతున్నారు

''ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకూ చాలా రాష్ట్రాలు, ప్రాంతాల్లో కొత్తిమీర వాడుతారు. మెత్తగా నూరిన వట్టి ఆకుల ముద్ద కావచ్చు, కొబ్బరితో కలిపి వాడే పచ్చడి కావచ్చు, ఈశాన్య భారతదేశంలో ఉపయోగించే బాగా పొడవైన రకం కావచ్చు.. వంటల చిట్టాలో కొత్తిమీరది చెరగని స్థానం’’ అని ఆయన వివరించారు.

ఇది ఆహారం తినేటపుడు ఇంద్రియాలను ఉత్తేజితం చేస్తుందని, ముక్కు రంగంలోకి దిగుతుందని మొత్తం వంట అంతా మంచి వాసనతో రుచిగా మారుతుందని ఆయన చెప్తారు.

అయితే కొత్తిమీర ప్రాశస్త్యాన్ని విస్మరించటం, దానిని గుర్తించకపోవటం రణ్‌వీర్ బ్రార్‌కు బాధకలిగించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన లాగే బాధపడుతున్న ఓ పోస్ట్ చూశారు. దీంతో.. కొత్తిమీరకు 'దక్కవలసిన కీర్తి’ని దక్కించటానికి.. 2022 మార్చిలో ఆయన Change.orgలో ఒక పిటిషన్ ప్రారంభించారు. కొత్తిమీరను 'భారత జాతీయ ఓషధి మొక్క’గా ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఈ వేదిక మీద అగ్రస్థాయి పిటిషన్ల సరసన చేరాలంటే.. 35,000 మంది సంతకాలు చేయాలి. కొత్తిమీర పిటిషన్‌ మీద ఇప్పటివరకూ దాదాపు 32,000 మంది సంతకం చేశారు.

ఈ పిటిషన్‌కు వచ్చిన సంతకాల్లో 87 శాతం భారతదేశంలోని ప్రజల నుంచి రాగా.. మిగతా మొత్తం ప్రవాస భారతీయుల నుంచి వచ్చాయని Change.org మార్కెటింగ్ కాంపెయిన్స్ మేనేజర్ మాధురి జానకి జుట్షీ తెలిపారు. కొత్తిమీరకు రణ్‌బీర్ బ్రార్‌ లాగానే చాలా మంది అభిమానులున్నారు. వారు ఈ పిటిషన్ కింద కామెంట్లలో దానిపై తమ ప్రేమను తెలిపారు. ''కొత్తిమీర లేని ఆహారం.. కిరీటం లేని యువరాణిలా ఉంటుంది’’ అని ఒకరు కామెంట్ చేశారు. ''నిజంగానే కొత్తిమీర మన జాతీయ ఓషధి మొక్క. అది లేకపోతే మన వంట పూర్తయినట్లు అనిపించదు’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఈ అంశాన్ని భారత ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పారా వద్దకు తీసుకెళ్లారు. ఏ మొక్కకైనా జాతీయ ఓషధి మొక్కగా అధికారిక హోదా ఇచ్చే ప్రక్రియలో ఆయన పాత్ర ఉంటుంది.

ఈ పిటిషన్ విజయాన్ని.. స్పష్టమైన ఫలితాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రాతిపదికగా తీసుకుని రణ్‌బీర్ బ్రార్ తుదిగా నిర్ణయిస్తారని జుట్షి చెప్పారు. ఆ పిటిషన్‌కు వచ్చిన తుది సంతకాల లెక్క మీద ఒక ఎర్ర జెండా చిహ్నంతో ఆయన పిటిషన్ విజయాన్ని సూచిస్తారని వివరించారు.

కొత్తిమిర వంట

అయితే.. తుది లక్ష్యం మాత్రమే కాకుండా.. ఒక ప్రక్రియను కొనసాగించటం ఈ పిటిషన్ అసలు విజయం. ''ఏదైనా ఒక అంశం మీద కదలికను తెచ్చే పిటిషన్లు వాటి దారిలో విజయవంతం అయ్యాయని మేం నమ్ముతాం’’ అని జుట్షి పేర్కొన్నారు. కొత్తిమీరను భారత జాతీయ ఓషధి మొక్కగా ప్రకటించాలన్న బ్రార్ పిలుపు.. ఆయనకు ఉద్యమం కాదు.

''ఈ ఆలోచనను కలిగించటం.. దీనిపై దేశంలో చర్చను ప్రారంభించటం’’ తన ఉద్దేశమని ఆయన చెప్పారు. ''ఇటలీకి తులసి (బేసిల్), ఫ్రాన్స్‌కు మరువం (మార్జోరామ్‌) జాతీయ ఓషధి మొక్కలుగా ప్రాతినిధ్యం వహిస్తుంటే.. భారతదేశపు జాతీయ ఓషధి మొక్క ఏమిటి? మన దేశంలో సర్వాంతర్యామిగా కనిపించే, ఎన్నో విషయాలకు ప్రాతినిధ్యం వహించే కొత్తిమీరకు మన ఆలోచనల్లో ఆ స్థానం ఎందుకు ఇవ్వకూడదు?’’ అని ఆయన ప్రశ్నించారు.

నిజానికి దక్షిణాసియాలో ఈ దినుసు కేవలం వంటకే పరిమితం కాదు. వంటలకన్నా మరింత లోతుగా విస్తరించి ఉంది. ''కొత్తిమీర పురాతన కాలం నుంచీ మన వంటగది వైద్యురాలిగా ఉంది’’ అని పాకిస్తాన్‌కు చెందిన ఓషధి శాస్త్రవేత్త డాక్టర్ బిల్కిస్ షేక్ చెప్పారు.

కొత్తిమీర వినియోగం వేల సంవత్సరాల కిందటి నుంచీ ఉంది. ప్రపంచమంతటా దీనిని భుజిస్తారు. భారతదేశంలో క్రీస్తుపూర్వం కొన్నివేల ఏళ్ల కిందట రచించిన వేదాల్లోను, సంస్కృత రచనల్లోనూ దీని ప్రస్తావన ఉంది. సంప్రదాయ ఔషధాల్లోనూ, ఆరోగ్యకరమైన ఆహారాల్లోనూ దీనిని ఆ కాలం నుంచీ వాడుతున్నారు.

''నాగరీకులు బరువు తగ్గటానికి, కడుపులో ఆరోగ్యాన్ని పెంపొందించటానికి పశ్చిమ దేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్స్లీ (కొత్తిమిరను పోలిన అజమోదము అనే ఓషధి మొక్క) ఆకు రసాలు, సప్లిమెంట్లు వాడుతుంటారు. మాకు కొత్తిమీర, ఇంటి వైద్యాలు ఉన్నాయి. కొత్తిమీర అనేది పేదవాడి పార్స్లీ’’ అని డాక్టర్ బిల్కిస్ అభివర్ణించారు.

అజీర్తి సమస్యకు కొత్తిమీర, సోపు (పెద్ద జీలకర్ర) కలిపి తీసుకోవటం కాలపరీక్షకు నిలిచిన పరిష్కారమని ఆమె చెప్పారు. పాలలో 20-25 కొత్తిమిర ఆకులను కలుపుకుని కాచి తాగితే వెన్నునొప్పులు, బహిష్టు నొప్పులకు తక్షణ ఉపశమనం లభిస్తుందని వివరించారు.

నోట్లో కురుపులు, మాడుమీద దద్దుర్లు వంటి సమస్యలే కాదు.. భ్రాంతితో కూడిన నిద్రలేమి వంటి సమస్యలకు కూడా కొత్తిమీర కలిపిన కషాయాలను డాక్టర్ బిల్కిస్ మందుగా ఇస్తుంటారు. ఈ ఓషధ మొక్కకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉందని.. ప్రత్యేకించి ఉప ఖండపు వాతావరణానికి దీనివల్ల ప్రయోజనం ఉందని ఆమె తెలిపారు.

భారతీయ వంటకాల్లో పచ్చి పుదీనా, కొత్తిమీర, టొమాటో కలిపి చేసే పచ్చడి వంటి ప్రధాన వంటకాలు శరీరాన్ని తేలికపరిచే, ఉత్సాహాన్ని, తాజాదనాన్ని అందించే ప్రభావాన్నిస్తాయి. నిజానికి కొత్తిమీర ద్వారా లభించే చాలా ఓషధ ఉపయోగాలు.. వేర్వేరు ప్రాంతాల్లో అక్కడి వాతావరణాల వల్ల పుట్టి అవి వంటల్లోకి చేరి ఉండవచ్చు.

ఉదాహరణకు.. భోపాల్‌ నగరంలోని కఠినమైన చెరువు నీరు అక్కడ తొలుత నివసించిన ప్రజలకు పడలేదని, దాంతో వాళ్లు అజీర్తి లక్షణాలను పరిష్కరించటానికి కొత్తిమీర తినటం ప్రారంభించారని రణ్‌బీర్ బ్రార్ వివరించారు. దీని నుంచే అక్కడి విశిష్ట వంటకం 'భోపాల్ రెజాలా’ పుట్టి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగు మీద తేరుకునే నీరు, పెరుగు ఉపయోగించి, చాలా ఎక్కువ మోతాదులో కొత్తిమీర వేసి చేసే కూర అది.

కొత్తిమీర వంటల్లోనూ, వైద్యంలోనూ బహుముఖంగా ఉపయోగించే దినుసు అనేది సుస్పష్టం. అయితే.. కొత్తిమీరకు గల మరింత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే.. ఆ మొక్కలోని ప్రతి భాగాన్నీ ఉపయోగించవచ్చు.

కొత్తిమిర

''వ్యర్థాలను తగ్గించటం కోసం 'వేరు నుంచి పండు’ వరకూ వినియోగించే అంశం గురించి ఇప్పుడు మనం సొగసుగా మాట్లాడుతున్నాం. కానీ కొత్తిమీరను అనాదిగా అలాగే వాడుతున్నారు’’ అని రణ్‌బీర్ బ్రార్ చెప్పారు.

''వంట ఎంత ఎక్కువ సేపు సాగితే.. కొత్తిమీర వినియోగం అంత దిగువకు వెళుతుంద’’ని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ దిగువకు అంటే.. ఆ మొక్క భాగాల్లో దిగువకు – ఆకు నుంచి, కాడ నుంచి, వేరు, విత్తు వరకూ – అని అర్థం.

ఉదాహరణకు లక్నోలో పేరొందిన నిహారీ వంటకు కొత్తిమీర వేర్లు గాఢమైన, కలపవంటి రుచిని ఇస్తుంది. నిహారీ అనేది మాంసాన్ని నెమ్మదిగా ఉడికించి చేసే ఒక ఘనమైన వంటకం.

ధనియాలతో పాటు.. లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, జీలకర్ర, మిరయాలను ఒక పలుచని బట్టలో చుట్టి కుండతో పాటు మాంసంలో పెట్టి.. గంటల తరబడి సన్నని మంటపై ఉడికిస్తారు. దీనిద్వారా వచ్చే చిక్కటి చారును పులావు తయారీకి ఉపయోగిస్తారు. వంటకం పూర్తయ్యాక చివర్లో తాజా లేత కొత్తిమిర ఆకులను జతచేస్తారు.

''పరిమళ ద్రవ్యాల తరహాలోనే కొత్తిమీరకు కూడా అగ్రస్థాయి, మధ్యస్థ, లోతైన వాసనలు ఉంటాయి. ఆకులు కొలోన్ తరహాలో ఉంటాయి. వంటకంపైన కొన్ని కొత్తిమీర ఆకులు చల్లుతారు. ఆ సువాసన కొంతసేపు ఉంటుంది. తర్వాత మాయమవుతుంది. కానీ కొత్తిమీర వేర్ల వాసన కస్తూరి పరిమళంలా చాలాసేపు కొనసాగుతుంది’’ అని రణ్‌బీర్ బ్రార్ వివరించారు.

వంటపుస్తకం రచయిత సైరా హామిల్టన్.. కొత్తిమీర కింది భాగాలతో వంట చేయటాన్ని ఎక్కువ ఇష్టపడతారు. ''వేర్లు, కాడలు ఉత్తమ భాగాలు’’ అంటారామె. ''పశ్చిమ దేశాలు తరచుగా ఏవగించుకునే కొత్తిమీర కాడలను పచ్చివిగా ఉన్నపుడు కొరికితే వాటి నుంచి వచ్చే రసం రుచి నాకు చాలా చాలా ఇష్టం. ఈ కాడలకు పచ్చిమిరపకాయలు, కారం కలిపి నూరితే.. ఏ మసాలాకైనా అదిరిపోయే రుచి వస్తుంది’’ అని ఆమె చెప్పారు.

వంటకంలో కొత్తిమీరను చాలా ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తారని.. ఆ వంటకంలోకి తను ఆహ్వానించదలచుకున్న 'పచ్చదనం’ గురించి చెఫ్‌కు పూర్తి అవగాహన ఉంటుందని.. మిషెలిన్ స్టార్ గెలుచుకున్న తొలి భారత మహిళ, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో గల గా, హిరి రెస్టారెంట్లలో చెఫ్‌ల యజమాని గరిమా అరోరా పేర్కొన్నారు.

దానిమ్మ, ఉల్లి, కొత్తిమిరతో కలిపి వండే పంది మాంసం వంటకంలో.. కొత్తిమీరను రెండు రకాలుగా చేరుస్తారు. కొత్తిమీర ఆకులతో తయారు చేసిన నూనెలో కొత్తిమీర కాడలను వేయిస్తారు. దీనిద్వారా ఆ కాడలకు విశిష్టమైన 'పచ్చదనం’ చేకూరుతుంది. ''దానిమ్మ నుంచి తీపి వస్తుంది. ఉల్లి, నిమ్మ నుంచి పులుపు లభిస్తుంది. కొత్తిమీర ద్వారా పచ్చదనంతో పాటు తాజా, పచ్చని రసం అందుతుంది’’ అని ఆమె వివరించారు.

కొత్తిమీరతో భారతీయ ఆహారానికి గల సంబంధం చాలా స్పష్టమేనని ఆమె నమ్ముతారు. దీనిపట్ల 'జన్యుపరమైన వికర్షణ’ గల భారతీయులు ఒక్కరిని కూడా తాను చూడలేదని అంటారు. అయితే.. కొత్తిమీరను భారతదేశపు 'అధికారిక’ ఓషధ మొక్క అని చెప్పటమంటే.. ఈ ప్రాంతానికి చెందిన ఇంకా చాలా వేర్వేరు రుచులను విస్మరించినట్లు అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎంతో వంటకాల వైవిధ్యంతో అలరారే నేల మీద 'జాతీయ ఓషధ మొక్క’ హోదా కోసం పోటీపడే ఓషధ మొక్కలు చాలానే ఉండి ఉండవచ్చు. కానీ దీనితో రణ్‌బీర్ బ్రార్‌కు సమస్యేమీ లేదు. ''కొత్తిమీర మాత్రమే ఎందుకు? మరొకటి ఎందుకు కాదు?’’ అన్న ప్రశ్న ఆయన ఎన్నడూ వేసుకోలేదు. ఆయన ప్రశ్నల్లా.. ''కొత్తిమీర ఎందుకు కాకూడదు?’’ అన్నదే.

కొత్తిమిర

''ఒక వంటకాన్ని బాగా పూర్తిచేశామనే సంతోషానికి కొత్తిమీర ప్రతీక’’ అని ఆయన అంటారు. ''పోషకానికి, సుందరంగా తీర్చిదిద్దటానికి మధ్య తేడా అది.. సంతృప్తినిచ్చే ఆహారానికి, ఉత్తేజపరిచే ఆహారానికి మధ్య తేడా అది’’ అని పేర్కొన్నారు.

మొత్తంగా చూస్తే.. రణ్‌బీర్ బ్రార్ ఉద్యమం.. కొత్తిమీరను జాతీయ వంటకంగా ప్రకటించటం కంటే .. భారతీయ వంటకాల ఆత్మలో కొత్తిమీరకు తగిన గుర్తింపు తేవటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

కొత్తిమీర లేకుండా భారతీయ రెస్టారెంట్‌ను ప్రారంభించే అంశాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తారా అని ఆయనన ప్రశ్నించినపుడు 'సాధ్యం కాదు’ అని బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు

English summary
Coriander: The uncrowned queen of Indian cuisine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X