ఇండియాలో కరోనా పీక్స్ , భారీగా కేస్ లోడ్ : గత 24 గంటల్లో 1,15,736 కొత్త కేసులు
నిన్న కాస్త తగ్గినట్టు అనిపించిన కరోనా కేసులు ఈరోజు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. నిన్న 97 వేలకు సమీపంగా నమోదైన కేసులు, ఈరోజు ఒక లక్ష 15వేలకు పైగా చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 1,15,736 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గా తెలుస్తోంది. కేసుల సంఖ్య భారతదేశంలో రెండవసారి 100,000 కు పైగా పెరిగింది. మొన్న ఏప్రిల్ 5 న దేశవ్యాప్తంగా 103,558 కొత్త కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీ లో నైట్ కర్ఫ్యూ ... ఏప్రిల్ 30 వరకు, కరోనా కట్టడికి కేజ్రీ సర్కార్ నిర్ణయం

1,15,736 కొత్త కేసులతో దేశంలో కరోనా పీక్స్
తాజాగా నమోదైన 1,15,736 కొత్త కేసులతో భారతదేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 1,28,01,785 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. గత 24 గంటల్లో 59,856 మంది రోగులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారని దీంతో ప్రస్తుతం మొత్తం కోలుకున్న కేసులు 11,792,135 కు చేరుకున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 8, 43,743 కు పెరిగాయి. నిన్న ఒక్కరోజే యాక్టివ్ కేసులు 55,250 కేసులకు పెరిగాయి.

గత 24 గంటల్లో 630 మరణాలు , మొత్తం మరణాల సంఖ్య 166,177
గత 24 గంటల్లో 630 తాజా మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 166,177 కు చేరుకుంది.
కరోనా మహమ్మారి నుండి కోలుకున్న కేసులు, మొత్తం కేసుల సంఖ్యలో 92.48 శాతం కాగా, క్రియాశీల కేసులు మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్యలో 6,21% గా ఉంది. కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాలు 1.30% ఉన్నాయి. దేశంలో కొత్త సానుకూల కేసులు మంగళవారం పరీక్షించిన 12,08,329 నమూనాల నుండి వచ్చాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.

పెరుగుతున్న కేసులతో పాక్షిక లాక్‌డౌన్లు, రాత్రి కర్ఫ్యూల తో పాటుగా కఠిన నిబంధనలు
ఇప్పటివరకు మొత్తం 25,14, 39,598 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
గత సంవత్సరం మొదటి తరంగంతో పోల్చితే కొనసాగుతున్న రెండవ తరంగంలో దేశం రోజువారీ కేసులను విపరీతంగా నివేదించడంతో, అనేక రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్లు, రాత్రి కర్ఫ్యూల తో పాటుగా కఠిన నిబంధనలను అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించాయి. మహారాష్ట్ర కరోనా కారణంగా భయంకరంగా ప్రభావితమైన రాష్ట్రంగా కొనసాగుతోంది.

మహారాష్ట్రలో కంట్రోల్ లో లేని కరోనా .. రంగంలోకి కేంద్ర బృందాలు
మంగళవారం ఒక్క రోజే మహారాష్ట్రలో 55,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదైనట్లు గా తెలుస్తుంది. ఏది ఏమైనా తాజా కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే, రాష్ట్రాలకు పలు సూచనలు సలహాలు ఇస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం రోజు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా కట్టడిపై కీలకంగా చర్చించనున్నారు.
ఇప్పటికే తీవ్రంగా కరోనాతో ప్రభావితం అయిన రాష్ట్రాలకు కేంద్ర బృందాలు చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కట్టడి యత్నాల్లో ఉన్నాయి.