ఇక బెంగళూరుకు వెళ్లాలంటే కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే: ఇప్పటికైతే ఈ రాష్ట్రాలవారికే
బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు.

అంతర్రాష్ట్ర ప్రయాణికుల వల్లే బెంగళూరులో కరోనా కేసులు
అయితే, ఈ నిబంధన కేవలం బెంగళూరు మహా నగరానికే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాక, రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. బెంగళూరులో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతానికిపైగా అంతర్రాష్ట్ర ప్రయాణికులే ఉన్నారని ఆయన తెలిపారు. బుధవారం ఒక్కరోజే బెంగళూరులో 1400 కరోనా కేసులు నమోదవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇప్పటికైతే ఈ రాష్ట్రాలవారికే..
గురువారం ఉదయం మంత్రి సుధాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, ఛండీగఢ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ (కరోనా నెగిటివ్ సర్టిఫికేట్) నిబంధనలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బెంగళూరు నగరంలోని పెద్ద పెద్ద భవన సముదాయాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

పిల్లలకు కరోనా సోకుతోంది..
గతంలో కేవలం తల్లిదండ్రులకే కరోనా పాజిటివ్ వచ్చేదని, కానీ, ఇప్పుడు మొత్తం కుటుంబానికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతోందని మంత్రి తెలిపారు. బస్ స్టేషన్లు, మార్కెట్లు, సినిమా థియేటర్లు, కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లు, పాఠశాలలు, కాలేజీల వద్ద భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా నిబంధనలను అమలయ్యేలా మార్షల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి సుధాకర్ వెల్లడించారు.

కరోనా నిబంధనలు మరింత కఠినంగా అమలు
వివాహాలు, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు బహిరంగ ప్రదేశాల్లో జరిగే 500 మంది వరకు ప్రజలు పాల్గొనవచ్చని, ఈ కార్యక్రమాలు మూసివున్న ప్రదేశాల్లో జరిగిదే 200 మంది మించకుండా ఉండాలన్నారు. ఇతర చిన్న చిన్న వేడుకలకు 50 మందికి మించకూడదని తెలిపారు. కరోనా వ్యాప్తి పరిస్థితులను బట్టి నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామన్నారు. కాగా, కర్ణాటకలో నిన్నటి వరకు 9,75,955 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 12,461 మరణాలు సంభవించాయి.. 9,46,589 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,886 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications