ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం- కాసేపట్లో ఫలితాలు ..!
ఉత్కంఠ రేపిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఇవాళ ఉదయం నుంచీ ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాని మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు అధికార, విపక్ష ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. మూడు పార్టీలు బీఆర్ఎస్, బీజేడీ, అకాలీదళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి. ఏపీలో విపక్ష వైసీపీ మాత్రం ఎన్డీయే అభ్యర్ధికి అండగా నిలిచింది. సాయంత్రం 5 గంటల వరకూ సాగిన ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది.
ఇవాళ జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 781 మంది ఓటర్లలో 12 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోలేదని అధికారులు ప్రకటించారు. మిగిలిన ఎంపీలంతా ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్దుల్లో ఒకరికి ఓటు వేశారు. విపక్షం నుంచి మొత్తం 315 మంది ఎంపీలు హాజరై ఓటు వేసినట్లు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. అంటే మొత్తం 100 శాతం మంది విపక్ష ఎంపీలూ ఓటేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈసారి ఉపరాష్టపతి ఎన్నికల్లో ఫలితాలు ఊహించినట్లుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు 400 ఓట్లకు పైగా పడినట్లు తెలుస్తోంది. విపక్ష ఇండియా కూటమి అభ్యర్ధి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300కు పైగా ఓట్లు పడినట్లు సమాచారం. దీంతో ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి కావడం లాంఛనంగానే తెలుస్తోంది. ఇదంతా ముందుగానే ఊహించి బీజేపీ మాాజీ మిత్రులు అకాలీదళ్, బీజేడీ, బీఆర్ఎస్ ఈ ఎన్నికలను బహిష్కరించి దూరంగా ఉండిపోయాయి. విపక్ష ఇండియా కూటమి మాత్రం తమ ఐక్యత చాటుకునేందుకే ఈ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టి చివరి వరకూ పట్టుదలగా పోరాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications