గుడ్‌న్యూస్: భారత్‌లో 4వ వ్యాక్సిన్ -Moderna టీకా దిగుమతి కోసం Ciplaకు DCGI అనుమతి
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి మరో శుభవార్త వెలువడింది. ఇప్పటిదాకా భారత్ లో అత్యవసర వినియోగానికి సీరం వారి కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్, రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్లు అందిస్తుండగా, ఇప్పుడు నాలుగో టీకాకు కూడా ఆమోదం లభించింది.
అమెరికాకు చెందిన దిగ్గజ ఫార్మా సంస్థ మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ల దిగుమతికి కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రఖ్యాత సిప్లా ఫార్మాసూటికల్ సంస్థ భారత్ లోకి మోడెర్నా వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు సోమవారం దరఖాస్తు చేసుకోగా, మంగళవారం నాడు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఫైజర్ తోపాటు మోడెర్నా అత్యంత సమర్థవంతమైన టీకాలుగా పేరుపొందడం తెలిసిందే. అమెరికా సహా యూరప్ దేశాలన్నీ మోడెర్నాను అధికంగా వినియోగిస్తున్నాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అయిన మోడెర్నా సమర్థత క్లినికల్ ట్రయల్స్ లో 90 శాతంగా తేలింది. సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
అమెరికాలో ఫైజర్, మోడెర్నా కలిపి ఇప్పటి వరకూ 12 కోట్ల మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు అధిక ధర, ఉత్పత్తి పరిమితులు, స్టోరేజీ, షిప్పింగ్ సమస్యలు వంటివి ఉండటం ఇండియాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అడ్డంకిగా మారింది. వాటిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించిన సిప్లా.. ఆ మేరకు కోల్డ్ చైన్ ను కూడా అభివృద్ధి చేసుకుంది. సంబంధిత పత్రాలు పరిశీలించిన అనంతరం భారత్ లోకి మోడెర్నా దిగుమతికి డీసీజీఐ అనుమతినిచ్చింది.
సిప్లా, మోడెర్నా మధ్య ఒప్పందం విలువ రూ.7,250 కోట్లని వాణిజ్యవర్గాలు తెలిపాయి. 2022నాటికి సుమారు 5కోట్ల మోడెర్నా వ్యాక్సిన్ డోసులను సిప్లా ఉత్పత్తి దిగుమతి చేసుకోనుంది. భారత్ లో దిగ్గజ సంస్థగా కొనసాగుతోన్న సిప్లా.. మోడెర్నాతో చేసుకున్న వ్యాక్సిన్ ఒప్పందం అత్యంత కీలకమైందని, కొవిడ్ మూడో వేవ్ ప్రమాదం నుంచి గట్టెక్కే దిశగా భారత్ లో వరల్డ్ క్లాస్ టీకాల అవసరం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications