కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93 శాతం రక్షణ కల్పిస్తోంది, 98 శాతం మరణం నుంచి తప్పించుకోవచ్చు
న్యూఢిల్లీ: కరోనావైరస్ నుంచి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 93 శాతం రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేగాక, మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98 శాతం తగ్గిస్తున్నట్లు తేలింది. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న సమయంలో కోవిషీల్డ్ ప్రభావంపై దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లపై ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ(ఏఎప్ఎంసీ) జరిపిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Recommended Video
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైరస్ నుంచి 93 శాతం రక్షణ పొందినట్లు నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో 98 శాతం మందికి మరణం ముప్పు తప్పిందని వెల్లడించారు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా వ్యాక్సిన్లు 100 శాతం రక్షణ కల్పించనప్పటికీ.. వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్ల ప్రభావంపై ఏమేర ఉందనేదానిపై తాజా అధ్యయనం తేల్చిందని పాల్ తెలిపారు.

కరోనావైరస్ సోకదని ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం గ్యారంటీ ఇవ్వలేదన్నారు. కానీ, తీవ్ర అనారోగ్యం బారినపడకుండా నిర్మూలించగలుగుతాయని తెలిపారు. అందుకే వ్యాక్సిన్లపై నమ్మకం ఉంచడంతోపాటు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని వీకే పాల్ కోరారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 44.19 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం జనాభాలో 9.9 కోట్ల మందికి రెండు డోసులు ఇచ్చినట్లు తెలిపింది.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రంలో మాత్రం భారీగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 24 గంటల్లో 22వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications