
సీబీఐ; ఈడీ ఇప్పుడు ఈసీ.. హేమంత్ సోరెన్ ఇష్యూపై సీపీఐ నారాయణ
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇష్యూపై సీపీఐ నారాయణ స్పందించారు. బీజేపీ తీరును ఆయన తీవ్రస్థాయిలో ఎండగట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వాలు ఉండొద్దా అని అడిగారు. హేమంత్ సోరేన్, ఆయన అనుచరులపై గురువారం సీబీఐ, ఈడీ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోరేన్‌పై అనర్హత వేటుకు సిఫారసు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈసీ నిర్ణయంపై సీపీఐ నారాయణ ఘాటుగా స్పందించారు. సోరేన్ బీజేపీకి అనుకూలంగా ఉండి ఉంటే.. సీబీఐ, ఈడీ దాడులు జరిగేవా అని అడిగారు. అంత ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత సిఫారసులు ఉండేవా? అని ప్రశ్నించారు. దేశంలో తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను బీజేపీ కూలదోస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరేన్‌పై వరుస దాడులు, తాజాగా ఎన్నికల సంఘం అనర్హత వేటుకు సిఫారసు తదితర ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.తమకు అనుకూలంగా లేని ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనుగడ సాగించకూడదనే భావనతో బీజేపీ సర్కారు సాగుతోందని విమర్శించారు.

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం అనర్హత లేఖను గవర్నర్‌కు పంపించారని సమాచరం. ఈ అంశంపై సోరెన్ స్పందించారు. దీనికి సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఆ డ్రాఫ్ట్ బీజేపీ తయారు చేసిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. తాము వేసిన పిల్‌లో సక్సెస్ అయ్యామని, నైతిక కారణాలను చూపుతూ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల సంఘం తన లేఖలో ఏం చెప్పిందో ఇంకా స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. అక్రమంగా మైనింగ్ లీజుకు సోరెన్ అనుమతి ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఆ కేసులో సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని పిల్ దాఖలైంది. ఆ మేరకు ఈసీ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.