సీడబ్ల్యూసీ మీటింగా? అలాంటిదేం లేదే..!
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజీనామాపై పలు వార్తలు వస్తున్నాయి. పదవి నుంచి తప్పుకునే విషయంలో ఆయన పట్టువీడటంలేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే మరోసారి భేటీ కానుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
సీడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అవన్నీ నిరాధార వార్తలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. పేరు బయట పెట్టేందుకు ఇష్టపడని మరో సీనియర్ నేత సైతం ఇదే విషయం చెప్పారు.

రాహుల్ రాజీనామా వార్తల నేపథ్యంలో సీనియర్ నేతలు ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. సోమవారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, మరో సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆయనతో భేటీయై చర్చించారు. తాజాగా సోదరి ప్రియాంక గాంధీతో పాటు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా, రాజస్థాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సచిన్ పైలెట్ రాహుల్‌ను కలిశారు. రాజీనామా నిర్ణయంపై పునరాలోచించాలని వారు ఆయనతో చెప్పినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ల వ్యవహారశైలి కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నేతలు పార్టీ కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం ముఖ్యంగా తమ కొడుకులు, బంధువుల్ని గెలిపించుకునేందుకు పనిచేశారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. అసోం మాజీ సీఎం, సీడబ్ల్యూసీ మెంబర్ తరుణ్ గొగోయ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొత్తమ్మీద సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది.












Click it and Unblock the Notifications