Cyclone Biparjoy : గుజరాత్ లో బిపర్ జోయ్ అల్లకల్లోలం-69 రైళ్ల రద్దు- 21వేల మంది షిఫ్ట్..
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను గుజరాత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడ్డ బిపర్ జోయ్ ప్రభావం ఇంకా గుజరాత్ తో పాటు మహారాష్ట్రలోని తీర ప్రాంతాలపై కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఐఎండీ తాజా హెచ్చరికలు గుజరాత్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్దితిని నిశితంగా గమనిస్తూ తగు సూచనలు చేస్తోంది.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అత్యంత తీవ్రమైన తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్రమైన తుఫానుగా బలహీనపడింది. ఇది ఎల్లుండి అంటే జూన్ 15 సాయంత్రం నాటికి గుజరాత్ లోని జఖౌ పోర్ట్ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని 21 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పర్యాటకులు, స్థానిక ప్రజలు గోమతి ఘాట్, శివరాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారకతో పాటు తీరం వెంబడి ఇతర ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారులు ఐదు రోజుల పాటు తీరానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాను బిపర్ జోయ్ జూన్ 16న నైరుతి రాజస్థాన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నందున
వాయువ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే పశ్చిమ రైల్వే కూడా 69 రైళ్లను రద్దు చేసింది. మరిన్ని రైళ్లు దారి మళ్లించడం, పాక్షికంగా రద్దు చేయడం చేస్తున్నారు.
గుజరాత్ కే చెందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రంలో తుపాను పరిస్ధితిపై స్వయంగా సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే తుపాను నష్టం తగ్గించడానికి వీలుగా కేంద్ర బలగాలను పంపడం, పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఎల్లుండి తుపాను తీరం దాటే సమయంలో జరిగే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం తరఫున అవసరమైన సాయం చేస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications