Delhi Blast:పేలుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..?
Delhi car blast:సోమవారం సాయంత్రం ఢిల్లీ నగరంతో పాటు దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఓ కారులో ఉంచిన శక్తివంతమైన బాంబు పేలడంతో ఆ ప్రాంతమంతా చెల్లా చెదురుగా కనిపించింది. ఈ పేలుడు ఘటనలో 9 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరిని చికిత్స కోసం సమీపంలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ పేలుడును ప్రత్యక్షంగా చూసిన పలువురు ఈ ఘటన గురించి వివరించారు.
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఆ ప్రాంతమంతా భయాందోళనలను రేకెత్తించింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో సమీపంలోని ఐదు నుండి ఆరు వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి రోడ్డుపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఇంకా చాలా మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఈ పేలుడు సంభవించింది.పేలుడు చాలా శక్తివంతంగా ఉందని, భవనాల కిటికీలు కూడా తెరిచి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "నేను నా దుకాణంలో కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా అంత పెద్ద పేలుడు సంభవించి నా కుర్చీలోంచి పడిపోయాను. నా జీవితంలో ఇంత శక్తివంతమైన పేలుడు శబ్దం నేను ఎప్పుడూ వినలేదు" అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.
చేయి తెగి పడిపోయింది..
మరో ప్రత్యక్ష సాక్షి రాజ్‌ధర్ పాండే మాట్లాడుతూ, తాను ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపించిందని చెప్పారు. దీంతో తాను టెర్రస్‌పైకి వెళ్లి చూడగా ఆకాశానికి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని చూసినట్లు వెల్లడించాడు. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో అంతటా గందరగోళం నెలకొందని తెలిపాడు. సంఘటన స్థలంలో ఉన్న మరో స్థానిక నివాసి మాట్లాడారు. పేలుడు సంభవించిన తర్వాత తాము అక్కడికి చేరుకున్నప్పుడురోడ్డుపై ఒకరి చేయి పడి ఉండటాన్ని చూసినట్లు వెల్లడించారు. తాము పూర్తిగా షాక్‌లో ఉండిపోయినట్లు చెప్పిన స్థానికులు ఆ దృశ్యం వర్ణనాతీతంగా ఉందని పేర్కొన్నారు. సమీపంలోని అనేక కార్లు దెబ్బతిన్నాయని,శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు చెప్పారు. ఏమి జరిగిందో ఎవరికీ అర్థం కాలేదని వివరించారు.
#WATCH | Delhi: Blast near Red Fort Metro station | A team of Delhi Police Crime Branch arrives at the spot. pic.twitter.com/FpCj1FHqow
— ANI (@ANI) November 10, 2025
ఇదిలా ఉంటే ఈ పేలుడు ఎకో వ్యాన్‌లో సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇంకా నిర్థారించలేదు.పేలుడు ధాటికి గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక దళాలు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications