తీహార్ సెంట్రల్ జైలులో దారుణ హత్య
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని తీహార్ కేంద్ర కారాగారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్‌స్టర్లు అతణ్ని కొట్టి చంపారు. తీవ్ర గాయాల పాలైన అతణ్ని జైలు అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు.
ఆ గ్యాంగ్‌స్టర్ పేరు టిల్లు తేజ్‌పురియా. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానంలో కాల్పులు జరిపిన ఘటనలో అతను నిందితుడు. ఈ కేసులో అరెస్టయిన టిల్లును పోలీసులు విచారిస్తోన్నారు. తీహార్ కేంద్ర కారాగారంలో అతను విచారణను ఎదుర్కొంటోన్నాడు. ఇదే జైలులో శిక్షను అనుభవిస్తోన్న తోటి గ్యాంగ్‌స్టర్లు యోగేష్ తుండా, అతని అనుచరులు టిల్లు తేజ్‌పురియాతో ఘర్షణ పడ్డారు. పరస్పరం దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో టిల్లు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతూ స్పృహ తప్పిన స్థితిలో అతణ్ని జైలు అధికారులు ఢిల్లీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. టిల్లు తేజ్‌పురియా మరణించినట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. టిల్లుపై యోగేష్ తుండా గ్యాంగ్ దాడి చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఆరా తీస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications