హత్రాస్ : యూపీ సర్కార్ తీరుపై జర్నలిస్ట్ యూనియన్ దిగ్భ్రాంతి... ఎందుకు అనుమతించట్లేదు?
హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించిన ప్రభుత్వం ఎవరినీ అటువైపు అనుమతించట్లేదు. విపక్షాల సంగతి పక్కనపెడితే... ఆఖరికి మీడియాను కూడా బాధితులతో మాట్లాడకుండా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ ఓ లేఖ కూడా విడుదల చేసింది.
'బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు... ఎవరూ వాళ్లను కలవకుండా అడ్డుకుంటున్నారు... గ్రామంలోకి ఎవరినీ అనుమతించట్లేదు... మీడియా సిబ్బంది,రిపోర్టర్లు,కెమెరామెన్లు గ్రామ సమీపంలోని రోడ్డుపై నిలబడిపోయారు... గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డున్నారు.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబరెయిన్,కకోలి ఘోష్ దస్తీదార్ సహా పలువురు నేతలు గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు...' అని లేఖలో ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ పేర్కొంది.

'గురువారం(అక్టోబర్ 1) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాలి నడకనే హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకుని కిందకు తోసేశారు. హత్రాస్ వెళ్లకుండా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను కూడా ఇంట్లోనే నిర్బంధించారు. మరోవైపు బాధితురాలిపై అసలు అత్యాచారమే జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి మృతదేహానికి హడావుడిగా అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించి... సెకండ్ పోస్టుమార్టమ్‌కు కూడా అవకాశం లేకుండా చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది..' అని ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్ పేర్కొంది.
'సంఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై దిగ్భ్రాంతితో పాటు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. మీడియాపై ఆంక్షల పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నాం. పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఏ విషయాలను దాచేందుకు ప్రయత్నిస్తోంది... ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది...?' అని జర్నలిస్ట్ యూనియన్ తీవ్ర అసంతృప్తిని,ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications