తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలి.. టీవీకే సంచలన డిమాండ్!
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు 'ప్రత్యేక జెండా' వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రి ఆధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. జాతీయ త్రివర్ణ పతాకంతో సమానంగా తమిళనాడు రాష్ట్రానికి కూడా ప్రత్యేక జెండా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే తమిళనాడు దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న ఈ జెండాను ముఖ్యమంత్రి జె జోసెఫ్ విజయ్ మొదటిసారిగా ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా ఈ జెండాను అధికారికంగా ఎగరవేయాలని కోరారు.

విచ్ఛిన్నకర ఆలోచనలంటూ బీజేపీ మండిపాటు
ఆధవ్ అర్జున్ చేసిన ఈ డిమాండ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. తమిళనాడు బీజేపీ నేత వినోద్ పి సెల్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళ గుర్తింపును, భారతీయ గుర్తింపును వేర్వేరుగా చూపిస్తూ ప్రజలలో విచ్ఛిన్నకర ఆలోచనలను పెంచి పోషించేందుకు టివికె ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మన తమిళ భాషకు లేదా సంస్కృతికి ఇటువంటి ప్రత్యేక సర్టిఫికేట్లు అవసరం లేదని, భారత జాతీయ జెండా కింద మన తమిళ ఆత్మగౌరవం ఏమాత్రం తగ్గిపోదని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన విభాజక రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.
పరిశీలనలో ఉందన్న ప్రభుత్వం: ఇతర రాష్ట్రాల బాటలో తమిళనాడు?
ఈ వివాదం నడుస్తుండగానే తమిళనాడు ప్రభుత్వ మంత్రి రాజమోహన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల మాదిరిగానే తమిళనాడుకు కూడా ప్రత్యేక రాష్ట్ర జెండాను రూపొందించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు. నవంబర్ 1ని అధికారికంగా తమిళనాడు దినోత్సవంగా ప్రకటించినందున, రాబోయే రోజుల్లో రాష్ట్ర జెండా రూపకల్పనపై తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు. దీంతో ఈ ప్రత్యేక జెండా అంశం తమిళనాడు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది.














Click it and Unblock the Notifications
