విజయ్ పార్టీని నడుపుతోంది ఆ ఇద్దరు మంత్రులే..! ఏకంగా 99 శాతం విరాళాలు..!
మూడేళ్ల క్రితం తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి, ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం విజయ్ పార్టీ తమిళ వెట్రి కజగం (TVK) పాలనతో పాటు విరాళాల విషయంలోనూ పారదర్శకతను పాటిస్తోంది. తాజాగా ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో తమ పార్టీకి గత ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన మొత్తం విరాళాలు (TVK Donations) , అవి ఏయే దాతల నుంచి వచ్చాయో వివరాలు వెల్లడించింది.
వీటి ప్రకారం టీవీకే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నలుగురు దాతల నుండి రూ.13.3 కోట్ల మేర స్వచ్ఛంద విరాళాలు అందుకున్నట్లు ప్రకటించింది. ఈ నిధులలో 99 శాతం మంత్రులు ఆధవ్ అర్జున, ఆర్వీ రంజిత్‌కుమార్‌లే ఇవ్వడం విశేషం. ఆధవ్ అర్జున టీవీకేలో కీలక మంత్రి. ఆయన ప్రస్తుతం విజయ్ కేబినెట్లో క్రీడలు, ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అర్జున రూ. 8.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. మరో మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ టీవీకేకు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి టీవీకేకు లభించిన మొత్తం విరాళాలలో 60 శాతానికి పైగా వాటాతో మంత్రి ఆధవ్ అర్జున పార్టీలోనే అతిపెద్ద దాతగా నిలిచారు.

వీరు మినహాయిస్తే మిగిలిన విరాళాల్లో తూత్తుకుడిలోని లయన్స్ టౌన్‌లో ఉన్న 'స్నో షో' డీడీ ద్వారా 5 లక్షల విరాళాన్ని అందించింది. అదే చిరునామాలో నమోదైన 'స్నో ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్' కూడా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మరో రూ.5 లక్షలను విరాళంగా ఇచ్చింది. మరోవైపు గత ఆర్ధిక సంవత్సరంలో విపక్ష అన్నాడీఎంకే సుమారు రూ.161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలు పొందినట్లు ఈసీకి వివరాలు సమర్పించింది. ఇందులో టైగర్ అసోసియేట్స్ అత్యధికంగా రూ.135 కోట్లు విరాళంగా ఇచ్చి, అతిపెద్ద దాతగా నిలిచింది. ప్రధాన విపక్షం డీఎంకే సుమారు రూ.191.19 కోట్ల విరాళాలు వచ్చినట్లుగా ఈసీకి నివేదిక ఇచ్చింది. ఇందులోనూ టైగర్ అసోసియేట్స్ రూ.125 కోట్లతో దీనికి అతిపెద్ద దాతగా నిలిచింది. కోల్‌కతాకు చెందిన లాటరీ సంస్థ టైగర్ అసోసియేట్స్‌కు, లాటరీ దిగ్గజం శాంటియాగో మార్టిన్‌కు ఒక ఉమ్మడి వ్యాపార భాగస్వామి ద్వారా సంబంధం ఉంది. దీంతో ఈ రెండు పార్టీల్ని నడుపుతోంది టైగర్ అసోసియేట్స్ అని అర్థమవుతోంది.













Click it and Unblock the Notifications
