నిరసనల వేళ.. దూకుడు పెంచిన ఈసీ: తమిళనాడు సహా 17 రాష్ట్రాలకు తాజా ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల రూపకల్పనపై తీవ్రస్థాయిలో వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర ఎన్నికల కమిషన్ దూకుడు మరింత పెంచింది. వెనక్కి తగ్గేదే లేదని చెప్పకనే చెప్పింది. ఎస్ఐఆర్ పై తాజాగా 17 రాష్ట్రాలకు తాజా ఆదేశాలను ఇచ్చింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఈసీ. సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించడం, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడం, తప్పులను పూర్తిగా సరిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం.
అండమాన్ నికోబార్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మణిపూర్, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ లకు స్పెషల్ సమ్మరీ రివిజన్ వర్తిస్తుంది. దీని ద్వారా 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా అడ్రస్ మార్పు, పేరులో తప్పుల దిద్దుబాటు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించే ప్రక్రియను ఈసీ చేపడుతుంది.

2027 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకునే యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ఆ తర్వాతి త్రైమాసికాలైన ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి అర్హత సాధించే యువత కూడా ముందస్తుగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.. ఈసీ. ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు వీలుగా విస్తృతస్థాయి చర్యలు చేపట్టాలని కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.
అర్హులైన వారితో పాటు ఇప్పటివరకు జాబితాలో పేర్లు లేని పౌరులను ఓటర్లుగా చేర్చడానికి స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కూడా ఈ సవరణ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, సర్దుబాటు ప్రక్రియ ఈ ఏడాది నవంబర్ 2 నాటికి పూర్తి చేయాలి. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అదే నెల 12న పబ్లిష్ చేస్తారు.
అభ్యంతరాలను తెలియజేయడానికి నవంబర్ 12 నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంటుంది. అదే నెల 28వ తేదీ నాటికి వాటిని ఎన్నికల సిబ్బంది పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితా 2027 జనవరి 4న ప్రచురిస్తారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రత్యేక తీవ్రమైన సవరణ కొనసాగుతోంది. ఈ రాష్ట్రాలకు సంబంధించిన సవరణ షెడ్యూల్ను త్వరలోనే వేరుగా ప్రకటిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
