ఇండియా కూటమి నిరసనల్లోకి టీవీకే..! అసలు రీజన్ ఇదేనా ?
ఎస్ఐఆర్ విషయంలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ పదవికి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం నిత్యం విపక్ష ఇండియా కూటమి పార్టీలు గళమెత్తుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటివరకూ తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న టీవీకే మాత్రం కనిపించలేదు. ఓవైపు కాంగ్రెస్ తో, మరోవైపు బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ పార్టీ టీవీకే.. తాజాగా ఈ నిరసనల్లోకి అడుగుపెట్టింది. సీఈసీకి వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు తమిళనాడులో నిరసనలకు దిగారు.
తమిళనాడులోని చెన్నైలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన నిరసనలో టీవీకే (TVK) పాల్గొంది. ఇండియా కూటమిలో ఇప్పటికే భాగస్వాములుగా ఉన్న వీసీకేతో పాటు ఇతర పార్టీలతో కలిసి టీవీకే శ్రేణులు నిరసనల్లో పాల్గొన్నాయి. వీసీకే నేత ఎస్.ఎస్. బాలాజీ దీనిపై స్పందించారు. తమిళనాడు విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల సంఖ్య పరిమితమని, కాబట్టి ఇండియా కూటమిలో చేరడానికి టీవీకే ఆసక్తిని వ్యక్తం చేసిందని ఆయన వెల్లడించారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తాజాగా పలుమార్లు సమావేశమైనప్పుడు టీవీకే కనిపించలేదు. కానీ ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో టీవీకే నేరుగా రంగంలోకి దిగక తప్పని పరిస్ధితులు వచ్చేస్తున్నాయి. త్వరలో జరిగే ఇండియా కూటమి భేటీలో టీవీకే అధికారిక చేరికకు ఆమోదం లభిస్తుందని వీసీకే నేత బాలాజీ తెలిపారు.

టీవీకే ఇప్పటికే ఇండియా కూటమిలో భాగమైందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇండియా కూటమిలోకి టీవీకే చేరేందుకు ఇంకా ఆలోచిస్తుండటం, అలాగే టీవీకేను చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తుండటం వెనుక అసలు కారణం డీఎంకేనే. ఎందుకంటే గత తమిళనాడు ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ఓటమి పాలయ్యాక డీఎంకే కూటమికి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ విజయ్ కూటమిలో చేరిపోయింది. దీంతో ఇండియా కూటమితో డీఎంకే అంటీముట్టనట్టుగా ఉండటం ప్రారంభించింది. ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకేను చేర్చుకుంటే డీఎంకే అదే కారణం చూపి కూటమి నుంచి తప్పుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తూ వచ్చింది. ఇప్పుడు కీలక సమయంలో డీఎంకే ఇండియా కూటమి భేటీలకు దూరంగా ఉండటం, వచ్చే టీవీకేను రాకుండా అడ్డుకోవడం ఎందుకని ఇండియా కూటమిలోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.














Click it and Unblock the Notifications
