నదిపై దేశంలోనే అతి పొడవైన వంతెన.. 9.15 కి.మీ
మనకు పాకిస్తాన్ శత్రువు అనుకుంటాం. కానీ వాస్తవానికి భారతదేశానికి నిజమైన శత్రువు చైనా. కూలంకుషంగా గమనిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది. అందుకే చైనా గుండెల్లో గుబులు పుట్టించాలంటే ఇంజనీరింగ్ అద్భుతాలు చేయాలి. సరిగ్గా భారతదేశం అదే చేస్తోంది. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లను వేరు చేస్తున్న లోహిత్ నదిపై ఒక అద్భుతమైన కట్టడం రూపుదిద్దుకుంది. అదే 'ధోలా-సాదియా వంతెన'. దీనికి భూపేన్ హజారికా సేతు అని పేరు పెట్టారు. అస్సాంలోని ధోలాను, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని సాదియాను కలుపుతూ సాగే ఈ భారీ నిర్మాణం, కేవలం ఒక వంతెన మాత్రమే కాదు... భారత రక్షణ రంగానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక గొప్ప నిదర్శనం.
నవయుగ ఇంజనీరింగ్
ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించాలంటే నదిలో పడవలే గతి. గంటల కొద్దీ ప్రయాణించి, దాదాపు 6 గంటలు వృథా చేసుకునేవారు స్థానికులు. కానీ, ఈ వంతెన వచ్చాక ఆ కష్టాలన్నీ ఒక్క గంటలోనే తీరిపోయాయి. కేవలం నీటిపై ఉన్న భాగమే 9.15 కిలోమీటర్లు ఉండగా, ఇరువైపులా ఉన్న అనుసంధాన రహదారులను కలుపుకుంటే దీని మొత్తం పొడవు 29 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అస్సాం గర్వించదగ్గ సాంస్కృతిక దిగ్గజం, దివంగత గాయకుడు డాక్టర్ భూపేన్ హజారికా జ్ఞాపకార్థం ఈ అద్భుత నిర్మాణానికి ఆయన పేరునే అధికారికంగా పెట్టారు. సుమారు 2,056 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రయివేట్ పార్ట్ నర్ షిప్ విధానంలో పురుడు పోసుకున్న ఈ బృహత్ ప్రాజెక్టును మన తెలుగు దిగ్గజం 'నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ' అద్భుతంగా పూర్తి చేసింది. ఈ మహా నిర్మాణానికి కావలసిన సుమారు 30 వేల టన్నుల అత్యంత నాణ్యమైన ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థ 'సెయిల్' అందించడం విశేషం.

సైనిక వ్యూహంలో ప్రత్యేకత ఉంది
ఈ వంతెన అసలు సిసలు ప్రత్యేకత సైనిక వ్యూహంలో ఉంది. చైనా సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మార్గం, దేశ రక్షణకు ఒక బలమైన కవచంలా నిలిచింది. రేపు సరిహద్దుల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తినా, ఏకంగా 60 టన్నుల బరువుండే బ్రహ్మాండమైన యుద్ధ ట్యాంకులు సైతం క్షణాల వ్యవధిలో సరిహద్దు ప్రాంతాలకు దూసుకెళ్లేలా దీనిని అత్యంత పటిష్టంగా నిర్మించారు. అందుకే చైనా దీనిపై నానా యాగీ చేసినప్పటికీ భారత్ మాత్రం ఎక్కడా తగ్గకుండా, రాజీపడకుండా ఈ వంతెనను నిర్మించింది. శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ, మన సైన్యానికి సరికొత్త వేగాన్ని, భద్రతను ఇస్తున్న ఈ వంతెన... దేశ ప్రగతికి, రక్షణకు మధ్య వారధిలా ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేసింది.














Click it and Unblock the Notifications
