శ్యామ్ బెనగల్ కన్నుమూత..హైదరాబాద్ సంస్థానంలో పుట్టిన ఘనుడు
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శ్యామ్ బెనెగల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:00 గంటలకు శ్యామ్ బెనగల్ ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికారు. శ్యామ్ బెనగల్ మరణవార్తతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.శ్యామ్ బెనగల్ మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు. కొంకణి మాట్లాడే చిత్రాపూర్ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. శ్యామ్ బెనగల్‌కు సినిమాల పట్ల ఆసక్తి కలగడానికి తండ్రి కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో 12 ఏళ్ల వయస్సులోనే శ్యామ్ బెనగల్ తన మొదటి చిత్రాన్ని రూపొందించారు.హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ సంపాదించారు. ఆ తర్వాత హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు. ఇండియన్ సినిమా చరిత్రలో శ్యామ్ బెనగల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆయన్ను సినిమా ఆర్ట్ పితామహుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. చాలామంది దర్శకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అటు భారత ప్రభుత్వం తరుఫున శ్యామ్ బెనగల్ అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు.శ్యామ్ బెనగల్‌ను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీతో, 1991లో పద్మభూషణ్‌తో సత్కరించింది. అంకుర్, మండీ, నిషాంత్, మంథన్, జుబేదా, సర్దారీ బేగం, నేతాజీ సుభాష్ చంద్రబోస్-ది ఫర్‌గాటెన్ హీరో తదితర సినిమాలు ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి. ఎనిమిది సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 1970 -1980ల సినిమా ఉద్యమంలో శ్యామ్ బెనెగల్ యొక్క సినిమాలు ప్రధాన పాత్ర పోషించాయి. డిసెంబర్ 14న శ్యామ్ బెనగల్ తన 90వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications