వణికిస్తున్న దిత్వా.. స్కూల్స్ బంద్, 54 విమానాలు రద్దు!
శ్రీలంక తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఈ తుఫాను ప్రభావంతో శ్రీలంకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడ 80 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. దిత్వ తుఫాను ప్రభావంతో రోడ్లు, వంతెనలు, ఇళ్ళు ధ్వంసం అయ్యాయి.
తమిళనాడుకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్
27వ తేదీన గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తుఫాను, ప్రస్తుతం గంటకు 8 కి.మీ వేగంతో తమిళనాడు వైపుకు వెళుతోంది. దీని కారణంగా తమిళనాడు దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం దిత్వా తుఫానుపైన అలర్ట్ అయింది. దీంతో అత్యవసర బృందాలు ముందస్తు చర్యలను చేపట్టాయి.

తమిళనాడులోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా విల్లుపురం, కుడలూర్, చెంగల్పట్టు, పుదుచ్చేరి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల నుండి ఇప్పటివరకు 12700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాతావరణ శాఖ తమిళనాడులోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది.
చెన్నై విమానాశ్రయం అధికారులు 54 విమానాలు రద్దు
వర్ష ప్రభావిత ప్రాంతాలలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, విల్లుపురం, కుడలూరు, కళ్ళకురిచ్చి జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మన జిల్లాలో ఇప్పటికే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, తూత్తుకుడిలోని కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంకా తమిళనాడు పైన దిత్వ తుఫాను ప్రభావం ఉంటుందన్న సమాచారంతో చెన్నై విమానాశ్రయం అధికారులు 54 విమానాలను రద్దు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలలో ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications