బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరో తెలుసా ?, లిస్ట్ లో మేడమ్ పేరు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనుంది. ఆదివారం జాతీయ పార్టీ నాయకులు బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకను ఖాళీ చేసి వెళ్లిపోయారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఏదో ఒకటి అధికారంలోకి వస్తే ఆ పార్టీలోని నాయకులు సీఎం రేసులో క్యూలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
సోమవారం సాయంత్రం నుంచి ఏ పార్టీ అభ్యర్థి కూడా బహిరంగ ప్రచారం చెయ్యడానికి వీలులేదు. మే 10వ తేదీన ఓటరు దేవుళ్లు ఎవరిని ఆశీర్వదిస్తారో చెప్పడం చాలా కష్టంగా ఉంది. సర్వేలను నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు వాళ్ల గెలుపు కోసం వారి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ? అనే ప్రశ్నకు ఇంత వరకు సమాధానం చిక్కలేదు. మా పార్టీ అధికారంలోకి వస్తే తాను సీఎం అని ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఇంతకు ముందే బహిరంగంగానే చెప్పారు. అయితే బీజేపీలో సీఎం రేసులో చాలా మంది క్యూలో ఉన్నారు.
గతంలో బీఎస్. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు మరగేష్ నిరాణి సీఎం కావాలని ఢిల్లీకి వెళ్లి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. బీఎస్. యడియూరప్ప ఆశీస్సులతో బసవరాజ్ బోమ్మయ్ సీఎం అయ్యారు. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి.

బీజేపీ అధికారంలోకి వస్తే మురగేష్ నిరాణి కంటే ముందు బీజేపీ హైకమాండ్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో నిత్యం టచ్ లో ఉంటున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముందు వరుసలో ఉన్నారు. తరువాత మురగేష్ నిరాణి, బీజేపీ సీనియర్ నాయకుడు అరవింద్ బెల్లద్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ పార్టీ ఇన్ చార్జ్, కర్ణాటక మాజీ మంత్రి సీటీ. రవి కూడా సీఎం రేసులో ఉన్నారు.
మహిళలకు చాన్స్ ఇస్తే సీఎం కావాలని బీఎస్. యడియూరప్పకు సన్నిహితురాలైన కేంద్ర మంత్రి శోభా కరందాజ్లే సీఎం రేసులో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చకున్న శోభా కరందాజ్లే ప్రతిపక్షాలను ఏమాత్రం మొహమాటం లేకుండా ఎదర్కొంటు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక కర్ణాటక రాజకీయాల విషయంలో కేంద్రంలో ఎప్పటికప్పుడు చక్రం తిప్పుతున్న బీఎల్. సంతోష్ పేరు కూడా కర్ణాటక సీఎం పేర్ల జాబితాలో ప్రత్యేకంగా ఉంది. ఇంతకు ముందు చెప్పిన నాయకుల పేర్లు ఒక ఎత్తు అయితే బీఎల్. సంతోష్ పేరు మరో ఎత్తు అనే విషయం బీజేపీ నాయకులకు తెలిసిందే. మొత్తం మీద బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిన తరువాత సీఎం ఎవరు ? అనే విషయంలో బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇస్తుంది. ఈ నాయకులతో పాటు ఇంకా కొంత మంది సీనియర్ నాయకులు సీఎం కుర్చి కోసం లోలోపల డీల్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే మే 13వ తేదీ తరువాత మాత్రమే ఎంత మంది సీఎం సీటు కోసం పోటీలో ఉన్నారు అనే విషయం వెలుగు చూస్తుంది.












Click it and Unblock the Notifications