చనిపోతున్నా ఇతరుల కోసమే: నేతాజీ మృతిపై తాజా పత్రాలు వెల్లడి
లండన్: భారత స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మరణంపై ఇప్పటికీ అనేక సందేహాలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తరచూ ఆయన మృతికి సంబంధించిన పలు కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో కొన్ని కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక వస్తువులను, పత్రాలను జపాన్ ప్రభుత్వం ఇటీవల బహిర్గతం చేసింది. ఇవన్నీ 1945లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఇటీవల టోక్యోలోని విదేశాంగశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. 1956లో భారత ప్రభుత్వం బోస్ మరణంపై విచారణ నిర్వహించాలని కోరింది. దీంతో జపాన్ ప్రభుత్వం విచారణ నిర్వహించి తయారు చేసిన నివేదికలోని విషయాలనే ఇటీవల విడుదల చేశారు.

ఈ నివేదికలో తైవాన్‌లోని సైనిక వైద్యుల వాంగ్మూలాన్ని కూడా భద్రపర్చారు. ఈ నివేదిక ప్రకారం 1945 ఆగస్టు 18 మధ్యాహ్నం 1.50 ప్రాంతంలో చైనా పట్టణమైన డాలియన్ వద్ద విమానం కూలిపోయింది. తైపీ నుంచి విమానం టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో బోస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో కూడా బోస్ తొలుత మిగిలిన క్షతగాత్రులకు వైద్యం చేయాలని కోరినట్లు వైద్యుల వాంగ్మూలాన్ని బట్టి తెలుస్తోంది.
కాగా, అదే రోజు రాత్రి 7గంటలకు బోస్ కన్నుమూశారు. ఘటన అనంతరం ఆయన వస్తువులను జపాన్ తరలించిన క్రమాన్ని కూడా ఇందులో వెల్లడించారు. ప్రస్తుతం బోస్‌కి సంబంధించిన వస్తువులు టోక్యోలోని సుగినమి వార్డ్‌లోని రెంకోజి దేవాలయంలో భద్రపర్చారు. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతోపాటు గత ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బీహారీ వాజ్‌పాయి, ఇతర రాజకీయ ప్రముఖులు సందర్శించారు.
కాగా, తాజాగా విడుదల చేసిన పత్రాలను టోక్యోలోని విదేశీ మంత్రిత్వశాఖకు చెందిన దౌత్య కార్యాలయంలోని ఓ భవనంలో భద్రపర్చినట్లు జపాన్ పేర్కొంది. వీటిని ప్రజలు చూసేందుకు కూడా అనుమతించినట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications