చంద్రబాబు, కేసీఆర్ సేమ్ టూ సేమ్ ? పొరుగున మైండ్ బ్లాంక్ ! సాలిడ్ అజెండా కరవు?
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు తాజాగా రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే తెలంగాణలో తన ప్రాంతీయ పార్టీ టీఎర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ పొరుగు రాష్ట్రం ఏపీలో తొలిసారిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో వీరిద్దరి ఎంట్రీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. అయితే రాజకీయంగా అజెండాలు సెట్ చేసుకునే విషయంలో మాత్రం వీరిద్దరికీ ఇబ్బందులు తప్పేలా లేవు. అదెలాగో చూద్దాం..

తెలంగాణలో చంద్రబాబు రీఎంట్రీ
దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు రీఎంట్రీ ఇచ్చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాజాగా నిర్వహించిన బహిరంగసభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు రీఎంట్రీ ఇచ్చినట్లయింది. ఇక్కడి నుంచి సమర శంఖారావం పూరించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణోని ఇతర జిల్లాల్లో సైతం పర్యటించి టీడీపీకి పునర్ వైభవం తెస్తానని చెబుతున్నారు.
అంతే కాదు గతంలో టీఆర్ఎస్ కంచుకోటలుగా ఉన్న ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటనలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు అజెండాపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎంట్రీకి కేసీఆర్ రెడీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన బీఆర్ఎస్ పార్టీతో ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో బీజేపీని ముఖాముఖీ ఎదుర్కొంటూ ఆ పార్టీని జాతీయ స్ధాయిలో ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ను స్ధాపించిన కేసీఆర్.. ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రమైన ఏపీలో నిరూపించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అలాగే ఏపీలో కేసీఆర్ ఎంట్రీకి వచ్చిన ఇబ్బందులేమీ లేవు. ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీలోని విజయవాడలో ఆఫీసు ఏర్పాటుచేసుకుంటున్నా, బీఆర్ఎస్ బ్యానర్లు దర్శనమిస్తున్నా ఎలాంటి అభ్యంతరాలైతే వ్యక్తం కాలేదు. దీంతో కేసీఆర్ రాజకీయాలకు ఏపీలో వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది.

తెలంగాణలో చంద్రబాబుకు అజెండా కరవు?
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడున్నరేళ్లుగా పోరాడుతున్న చంద్రబాబుకు ఇక్కడి రాజకీయంపై పట్టు ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన క్యాడర్, నేతలు ఉన్నారు. అలాగే పలు జిల్లాల్లో ఇప్పటికీ చంద్రబాబుకు తన సామాజిక వర్గం అండ కూడా ఉంది. కానీ తెలంగాణలో విభజన తర్వాత మారిన పరిస్దితుల్లో టీడీపీ నేతలు, క్యాడర్ భారీగా వలసపోయారు.
అదీ ప్రధానంగా టీఆర్ఎస్ లోకి, ఆ తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. దీంతో కాసాని జ్ఞానేశ్వర్ వంటి కుల నేతను తెచ్చుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో మినహా మిగతా సమయాల్లో తెలంగాణపై దృష్టిపెట్టకపోవడంతో ఇక్కడి వాస్తవ సమస్యలపై చంద్రబాబుకు అవగాహన లేదు. అన్నింటికీ మించి తెలంగాణలో చంద్రబాబు ఇప్పుడు ఎవరిపై పోరాడాలన్నదానిపై స్పష్టత లేదు.
దీంతో ఖమ్మం జిల్లాలో పర్యటించినా ఎవరిపై విమర్శలు లేకుండా టీడీపీ రీఎంట్రీ ఇచ్చిన విషయం జనంలోకి వెళ్తే చాలన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారు. భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదిరితే అప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు చేసే అవకాశముంది. అప్పటివరకూ చంద్రబాబు చేయడానికీ ఏమీ లేదు.

కేసీఆర్ కు ఏపీలోనూ అదే పరిస్ధితి?
అలాగే తెలంగాణను దాటి ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ పరిస్ధితి కూడా అదే. ఎందుకంటే ఏపీలో తొలిసారి ఎంట్రీ ఇవ్వబోతున్న కేసీఆర్ వ్యవసాయ అజెండా అని చెబుతున్నా దాన్ని గట్టిగా ముందుకు తీసుకెళ్లే పరిస్ధితులు లేవు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏడాది వర్షాలు ఠంచనుగా పడుతున్నాయి.
దీంతో రైతులకు అంతగా సమస్యలు లేవు. అలాగని వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాడదామన్నా ఏపీలో సమస్యలపై కేసీఆర్ కు ఉన్న అవగాహన అంతంతమాత్రమే. అన్నింటికీ మించి తెలంగాణతో పోలిస్తే కుల రాజకీయాలు కనిపించే ఏపీలో సామాజిక సమీకరణాల్ని అర్ధం చేసుకుని రాజకీయం చేయడం అంత సులువు కాదు. దీంతో ఇక్కడ ఉన్న విపక్షాల్లో ఎవరో ఒకరితో కలిసి ముందుకెళ్లాలి.
కానీ ప్రస్తుత పరిస్ధితుల్లో విపక్షాలపరిస్ధితే దారుణంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ ను కలుపుకుంటే బీజేపీ వారికిదూరమవుతుంది. ఈ లెక్కన చూస్తే కమ్యూనిస్టులు కూడా కేసీఆర్ కు ఇక్కడ మద్దతిస్తారో లేదో తెలియదు. దీంతో కేసీఆర్ పరిస్దితి కూడా చంద్రబాబు తరహాలోనే కనిపిస్తోంది. దీన్ని ఇప్పటికిప్పుడు మార్చడం కానీ, పైచేయి సాధించడం కానీ కేసీఆర్ కు సాధ్యం కాకపోవచ్చనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications