కేరళలో మరో అమానుషం: కుక్క మూతిని టేప్‌తో చుట్టేశారు, నరకం చూసింది
తిరువనంతపురం: ఆ రాష్ట్రం దేశంలోనే అత్యధిక విద్యావంతులున్న రాష్ట్రం. కానీ, ఆ రాష్ట్రంలో ఇటీవల వెలుగుచూస్తున్న ఘటనలు మాత్రం దేశ ప్రజలను ఆవేదనకు, ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దేవభూమిగా పేరున్న కేరళలో ఇటీవల గర్భిణీ ఏనుగునుగా దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరో ఏనుగు కూడా ఇలాగే హత్యకు గురైంది.

కేరళలో మరో అమానుషం..
తాజాగా కేరళలో ఓ కుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిస్సూర్ జిల్లాలోని ఒల్లూర్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఎలాంటి ఆహారం తీసుకునేందుకు వీలు లేకుండా ఓ కుక్క మూతిని టేప్‌తో చుట్టేశారు కొందరు దుర్మార్గులు. అంతేగాక దాన్ని గొలుసులతో కట్టేశారు. ఈ మూడేళ్ల కుక్క టేప్ కట్టేయడంతో కొన్ని రోజులపాటు ఆహారం తీసుకోకుండానే జీవిస్తోంది. దీంతో సన్నగా మారిపోయింది. దాన్ని చూసినవారిని కలిచివేసింది.

ఎముకలు కనిపించేలా.. టేపు తీస్తుంటే చర్మం కూడా..
పీపుల్స్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ సర్వీసెస్(పీఏడబ్ల్యూఎస్) సభ్యులు ఈ కుక్కను గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. టేప్ గట్టిగా మూతి చుట్టూ కట్టడంతో ఆ కుక్క కనీసం నీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో ఉంది. గత కొద్ది రోజులుగా ఆహారం, నీరు లేకపోవడంతో ఆ కుక్క ఎముకలు కూడా బయటికి కనిపించేలా తయారైంది. టేపు కారణంగా ఆ కుక్క మూతి చుట్టూ గాయమైంది. టేపు తొలగిస్తున్న సమయంలో కుక్క చర్మం కూడా ఊడి రావడంతో ఆ జీవి తీవ్ర వేదనకు గురైంది.

2 లీటర్ల నీరు తాగంది.. ఓ గృహిణి చెంతకు..
టేపు తీసిన తర్వాత ఆ కుక్క సుమారు 2 లీటర్ల నీళ్లు తాగడం గమనార్హం. వెంటనే దానికి ఆహారం అందించారు. కాగా, ఆ కుక్కను తాము పెంచుకుంటామని, బాగా చూసుకుంటామని ఓ గృహిణి తీసుకెళ్లారు. దీంతో ఆ కుక్క కన్నీటి గాథకు తెరపడినట్లయింది. మనషులు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications