Doordarshan Anchor: ఎండల వార్తలు చదువుతూ లైవ్ లో సొమ్మసిల్లిన యాంకర్..!
దేశవ్యాప్తంగా ఎండలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి కాలం నేపథ్యంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. వీటి ప్రభావంలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చూస్తున్నాం. అయితే తొలిసారి టీవీ లైవ్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. టీవీల్లో వడగాల్పుల వార్తలు చదువుతున్న యాంకర్ సైతం సృహతప్పి పడిపోయారు. దీంతో వెంటనే సిబ్బంది స్పందించి ఆమెకు సపర్యలు చేపట్టారు.

నిన్న దూరదర్శన్ లో మహిళా యాంకర్ లోపాముంద్రా సిన్హా లైవ్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. సాధారణ వార్తలు పూర్తయ్యాక బులిటెన్ చివర్లో దేశవ్యాప్తంగా, అలాగే దక్షిణాసియాలో ఎండలు మండిపోతున్న వార్తలు చదువుతున్నారు. అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో ఒక్కసారిగా ఆమెకు కళ్లు తిరిగినట్లు అనిపించడంతో అలాగే లైవ్ లో కుప్పకూలారు. తాను కూర్చున్న కుర్చీలోనే వెనక్కి పడిపోయారు. అంతే వార్తా బులిటెన్ మధ్యలో నిలిచిపోయింది.
వెంటనే అక్కడే ఉన్న దూరదర్శన్ సిబ్బంది ఆమెకు సపర్యలు చేపట్టారు. ఆమె కళ్లపై నీళ్లు చల్లి తిరిగి స్పృహలోకి తెచ్చారు. దీంతో ఆమె కూడా కాసేపటికి షాక్ నుంచి తేరుకున్నారు. ఎండల వార్తలు చదువుతూ బయట రోడ్డు మీద ఉన్నట్లు అనిపించిందా లేక మరేదైనా కారణమో తెలియదు కానీ దూరదర్శన్ యాంకర్ ఇలా లైవ్ లో సృహకోల్పోవడం మాత్రం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications