కొండ నాలిక్కి మందేస్తే..కార్పొరేట్ల కోసమేనా?: వైద్య కోర్సులన్నీ ఒక్కటే వారధిగా ‘బ్రిడ్జి’

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వైద్యవిద్య రంగంలో సంస్కరణలు చేపట్టేందుకు పూనుకున్న కేంద్రం ఒక వివాదాస్పద ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఆయుర్వేదం, హోమియోపతి వైద్య విధానాలను అల్లోపతి వైద్య విధానం సరసన చేర్చేందుకు పూనుకుంటున్నది. అందుకోసం ఆయుర్వేదం, హోమియోపతి, యోగా తదితర సంప్రదాయ చికిత్సలను అందిస్తున్న భారతీయ వైద్యులు ఒక బ్రిడ్జి కోర్సు పూర్తి చేస్తే ఆధునిక (అల్లోపతి) వైద్య సేవల రంగంలోకి అడుగు పెట్టొచ్చన్న నిబంధనను ఈ బిల్లులో చేర్చారు. ఈ బ్రిడ్జి కోర్సు విధి విధానాలు ఎలా ఉండాలన్న విషయమై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిర్ణయం తీసుకుంటుంది.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ స్థానే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా రెండు రోజుల క్రితం లోక్‌సభలో ఎన్‌ఎంసీ బిల్లు 2017ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 కొత్త కాలేజీలు ప్రారంభించడానికి అడ్డే ఉండదు

కొత్త కాలేజీలు ప్రారంభించడానికి అడ్డే ఉండదు

వైద్యవిద్యారంగంలో సంస్కరణలు ప్రతిపాదించడం వరకు వరకు బాగానే ఉన్నది. అయితే ఈ బిల్లులో పేర్కొంటున్న అంశాలు సందేహస్పదంగా మారాయి. సంబంధిత మెడికల్ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన కాలేజీల గురించి గానీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల కోసం ఇక నుంచి ఎంసీఐలో మాదిరిగా ఎమ్మెన్సీలో అనుమతి పొందాల్సిన అవసరం లేదన్న నిబంధన కూడా ఉన్నది. దీనివల్ల వైద్య విద్య నాణ్యత పడిపోయే ప్రమాదం కూడా ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ రంగానిదే హవా అంతా. ఉదాహరణకు తెలుగునాట కార్పొరేట్ వైద్య కళాశాలలకు కొదవ లేదు.

 ఈ ఏడాది ఇలా ఈఎస్ఐ వైద్య కళాశాలలోనూ సీట్లకు కత్తెర

ఈ ఏడాది ఇలా ఈఎస్ఐ వైద్య కళాశాలలోనూ సీట్లకు కత్తెర

పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకతోపాటు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో పలు కార్పొరేట్ వైద్య సంస్థలు మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఈ బిల్లు చట్టంగా మారితే సదరు కార్పొరేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వైద్య కళాశాలల్లో వాటి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా సీట్లు పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ప్రతియేటా భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ప్రతి మెడికల్ కళాశాలలోనూ వసతుల కల్పనకు అనుగుణంగానే సీట్లలో అడ్మిషన్లకు అనుమతినిస్తోంది. ఈ ఏడాది నిజామాబాద్, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలతోపాటు హైదరాబాద్‌లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో వసతులు సరిగ్గా లేనందున సీట్లలో కోత విధించింది ఎంసీఐ.

 కానీ ఆ పేరుతో పూర్తిగా రద్దు కార్పొరేట్లకు గేట్లెత్తడమేనా?

కానీ ఆ పేరుతో పూర్తిగా రద్దు కార్పొరేట్లకు గేట్లెత్తడమేనా?

వసతులు సరిగ్గా లేకుంటా అడ్మిషన్లలో కోత విధించడం.. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో పూర్తిగా అడ్మిషన్లు మూసేయడం కార్పొరేట్లకు ఒకింత కష్టంగానే ఉంటుంది. తమ కళాశాలలకు అనుమతి కోసం ఎంసీఐ మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయి వంటి వారికి ఇబ్బడి ముబ్బడిగా ముడుపులు చెల్లించినట్లే.. తమ సంపాదనకు అడ్డుగోడలా ఉన్న నిబంధనలకు చరమ గీతం పాడాలంటే కొత్త చట్టం తేవాల్సిందే. అందుకోసం కేతన్ దేశాయి అరెస్ట్ కాగానే తాత్కాలికంగా ఎంసీఐ పాలకమండలిని రద్దు చేసినా.. తర్వాత ఆ సంస్థ అధికారులు నిబంధనల అమలు పట్ల కఠినంగా వ్యవహరించడమే కార్పొరేట్లకు కష్టంగా కనిపిస్తున్నదా? అన్న అనుమానాలు ప్రబలంగా ఉన్నాయి. ఎంసీఐ నిబంధనలు కఠినతరం చేసి.. అనుమతుల ప్రక్రియ దేశ ప్రజలకు అనువుగా ఉండేలా చూడాలే గానీ పూర్తిగా ‘కార్పొరేట్ల'కు గేట్లు ఎత్తేలా చూడటమేమిటని నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 ఎన్ఎంసీలో సభ్యుల నియామకం సర్కార్ ఇష్టం

ఎన్ఎంసీలో సభ్యుల నియామకం సర్కార్ ఇష్టం

ఇంతకుముందు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)లో వైద్యులు ఎక్కువగా ఉండే వారు. కానీ ప్రతిపాదిన ఎన్ఎంసీలో వైద్య నిపుణుల ఊసే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు.. వైద్య విద్యావ్యవస్థలో లోపాలను సరిచేసే సాకుతో ఎన్‌ఎంసీని ప్రతిపాదిస్తూ కేంద్రం ఈ బిల్లును రూపొందించింది. ఎంసీఐలో మాదిరిగా వైద్యులకే పరిమితం కాక ప్రతిపాదిత ఎన్‌ఎంసీలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖల ప్రతినిధులు, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రతినిధులు, ఆరోగ్యం, సైన్స్ రంగాల నిపుణులు, ఆర్థికవేత్తలను సభ్యులుగా నియమిస్తారు. ఆరోగ్యం, సైన్స్ రంగాల నిపుణులు, ఆర్థికవేత్తలను సభ్యులుగా నియమించేందుకు అన్వేషణ కమిటీ కూడా పని చేస్తుంది.

 రాష్ట్ర ప్రభుత్వాల వాదనలకు వారధిగా ఎంఏసీ

రాష్ట్ర ప్రభుత్వాల వాదనలకు వారధిగా ఎంఏసీ

కానీ ఇదంతా కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడి పోయినట్లు అవినీతిమయమైన ఎంసీఐని పూర్తిగా ప్రక్షాళన చేసి, కాలం చెల్లిన నిబంధనలు మార్చి సంస్కరించడానికి బదులు పూర్తిగా దాన్ని సమూలంగా మార్చడానికే ఎన్ఎంసీ తీసుకొచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక వైద్యవిద్యాభివృద్ధిని, వైద్యవృత్తిని ఎన్‌ఎంసీ నియంత్రించనున్నది. ఎన్‌ఎంసీకి అవసరమైన సలహాలిచ్చేందుకు మెడికల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎంఏసీ)ని ఏర్పాటు చేస్తారు. ఎన్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలియజేసేందుకు ఎంఏసీ వారధిగా ఉంటుంది. ఇందులోనూ ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంత సభ్యుడు ఉంటారు. ఎన్‌ఎంసీ చైర్మనే ఎంఏసీకి ఎక్స్ అఫిసియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 ఏడాదికోసారి ఎన్ఎంసీతో ఇలా ఆయా సంస్థల భేటీ

ఏడాదికోసారి ఎన్ఎంసీతో ఇలా ఆయా సంస్థల భేటీ

ఎన్ఎంసీ బిల్లులో 48వ నిబంధన ప్రకారం జాతీయ మెడికల్ సంఘం (ఎమ్మెన్సీ), సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఏడాదికొక సారి సంయుక్తంగా సమావేశమై హోమియోపతి, భారత వైద్యవిద్యా వ్యవస్థలు, వైద్య రంగంలో ఆధునిక వ్యవస్థల మధ్య అనుసంధానంపై చర్చించాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం ప్రత్యేకమైన ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్, ప్రోగ్రామ్‌లు అమలు చేసేందుకు అవసరమైన వారధులను రూపొందించాలని ప్రతిపాదించారు. బహుళ వైద్య విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో నూతన పద్దతులను ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. అందుకోసం చేసే నూతన ప్రతిపాదనలన్నీ ఈ సంయుక్త సమావేశంలో ఆయా సంస్థల సభ్యులంతా ఆమోదించాల్సి ఉంటుంది.

 ఎన్ఎంసీని వ్యతిరేకిస్తున్న ఐఎంఏ

ఎన్ఎంసీని వ్యతిరేకిస్తున్న ఐఎంఏ

ఇది ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యాకోర్సుల నిర్వహణ, వైద్య విద్యాసంస్థల రేటింగ్, ప్రాక్టీస్ తదితర అంశాలనూ ఎమ్మెన్సీ నిర్దేశిస్తుంది. ఈ ఎమ్మెన్సీకి చైర్మన్‌ను కేంద్రమే నియమిస్తుంది. ఎంసీఐ స్థానే 25 మంది సభ్యుల కమిషన్ కొలువుదీరుతుంది. కానీ ప్రతిపాదిత నిబంధనలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రతిపాదనలన్నీ వైద్య విద్య, ప్రొఫెషన్‌ను బలహీన పరిచేందుకేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. వైద్య వ్రుత్తి పూర్తిగా అధికారులు, వైద్యేతర అడ్మినిస్ట్రేటర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ముందుకు సాగుతుందని ఐఎంఏ తేల్చేసింది. భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) అధ్యక్షుడు కేకే అగర్వాల్ మాట్లాడుతూ ‘నియంత్రణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలి. స్వేచ్ఛ గల అడ్మినిస్ట్రేటర్లు అవసరం. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ని అడ్మినిస్ట్రేటర్లు నియమిస్తారు. దీంతో కమిషన్ సభ్యులంతా వారి అదుపులోనే ఉంటారు' అని చెప్పారు. ఈ బిల్లు పాసైన మూడేళ్లలో మెడికల్ గ్రాడ్యుయేట్లంతా ప్రాక్టీసింగ్ లైసెన్సులు పొందడానికి ‘లైసెన్సేట్' పరీక్ష రాయాల్సి ఉంటుంది.

 ఎన్ఎంసీని ఉపసంహరించుకోవాలన్న టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

ఎన్ఎంసీని ఉపసంహరించుకోవాలన్న టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

కార్పొరేట్‌ రంగానికి మేలు చేసే క్రమంలోనే వైద్యరంగాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రం జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)ని తీసుకువస్తోందని టీజేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ వైద్య ఐకాస ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో ‘నీట్‌'తో పాటు ఎంసీఐ రద్దు అంశాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. వైద్యరంగానికి ప్రమాదకరంగా ఉన్న ఎన్‌ఎంసీని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)లో జరిగిన తప్పిదాలను సరిదిద్దకుండా ఏకంగా దాన్ని రద్దు చేసి వైద్యులతో సంబంధం లేకుండా కొత్తగా ఎన్‌ఎంసీని తీసుకురావడం విచిత్రంగా ఉందన్నారు. ఐఎంఏ తెలంగాణ అధ్యక్షులు డా.టి.నర్సింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి డా.ఆవుల భరత్‌ప్రకాష్‌ మాట్లాడుతూ వైద్యరంగానికి విఘాతం కలిగించేలా ఉన్న ఎన్‌ఎంసీని వ్యతిరేకించాలని, ఎన్‌ఎంసీలో వైద్యనిపుణులకు అవకాశం కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Delhi: Doctors pursuing Indian systems of medicine, including ayurveda, and homeopathy may be allowed to practice allopathy after clearing a bridge course, according to a bill introduced in the Lok Sabha. The National Medical Commission Bill, 2017, which seeks to replace the existing apex medical education regulator, the Medical Council of India (MCI), with a new body, was moved by the government in the House.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి