ఆ లావాదేవీలపై నిఘా పెట్టండి: యూపీఐ చెల్లింపులపైనా... రాష్ట్రాలకు ఈసీఐ కీలకలేఖ!!
దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకులలో జరిగే అనుమానిత లావాదేవీలపై నిఘా పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికలలో డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేయడానికి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగడంతో పాటు, పలు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ లేఖ రాసింది.
ఈ లేఖలో అన్ని రాష్ట్రాలలోనూ రూ లక్షకు పైగా ఉన్న బ్యాంక్ లావాదేవీల వివరాలు సమర్పించాలని, బ్యాంక్ అధికారులను ఈ మేరకు అప్రమత్తం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. బ్యాంకర్లు ఇచ్చిన లావాదేవీల విశ్లేషణ బాధ్యత సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున బ్యాంకర్లు నియామవళిని ఖచ్చితంగా పాటించేలా అధికారులు చూడాలని పేర్కొంది.

ఎవరైనా బ్యాంక్ ఖాతాలో ప్రతి రోజు లక్ష రూపాయల నగదు డిపాజిట్ చేసిన, విత్ డ్రా చేసినా,అదే విధంగా నెలలో 10 లక్షలు పైబడి నగదు డ్రా చేసినా, లేదా ట్రాన్స్ఫర్ చేసిన అనుమానాస్పద బ్యాంకు లావాదేవీల వివరాలను ప్రతి రోజు ఆయా బ్యాంక్ అధికారులు ఎన్నికల అధికారులకు అందించేలా చూడాలని పేర్కొంది.
ఆన్ లైన్ లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది . అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటం కోసం ఒకే అక్కౌంట్ తో వివిధ అక్కౌంట్లకు యు.పి.ఐ. ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ల ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి వివరాలను కూడా సేకరించి, తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది.
రాజకీయ పార్టీల ఖాతాల నుండి చేపట్టే లావాదేవీల పైన నిఘా పెట్టాలని సూచించింది. 10 లక్షలకు మించిన నగదు ఉపసంహరణ మరియు డిపాజిట్ల పైన నిఘా పెట్టాలని పేర్కొంది. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థి , అభ్యర్థి కుటుంబ సభ్యులు తదితరుల బ్యాంకు ఖాతాల నుంచి లక్షకు మించి నిర్వహించే లావాదేవీలను అఫిడవిట్లో నమోదు చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications