BBC: బీబీసీకి తప్పని కష్టాలు...ఈ సారి ఈడీ పంజా..!
ప్రముఖ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ (BBC)పై ఈడీ మరోసారి పంజా విసిరింది. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ చట్టం (FEMA) నిబంధనలను భారత్‌లోని బీబీసీ కేంద్రం ఉల్లంఘించిందంటూ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసింది.
ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ పేర్కొన్న ఈడీ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాల్సిందిగా బీబీసీకి ఆదేశాలు ఇచ్చింది.అంతేకాదు బీబీసీ అధికారులు ఇచ్చే వివరణ లేదా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు వారిని కార్యాలయంకు రావాల్సిందిగా కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను బీబీసీ ఉల్లంఘించిందంటూ చెబుతున్న ఈడీ ఈ కోణంలో విచారణ చేపడుతోంది.

ఇదిలా ఉంటే గత ఫిబ్రవరి నెలలో బీబీసీలోని ఢిల్లీ కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఆ సమయంలో ఉద్యోగుల ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ కార్యాలయంలో కూడా 59 గంటలపాటు ఐటీ సోదాలు జరిగాయి.
ప్రధాని నరేంద్ర మోదీపై వివాదాస్పదమైన డాక్యుమెంటరీ విడుదల చేసినప్పటి నుంచి బీబీసీపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఈ డాక్యుమెంట్ విడుదలతో వివాదం రాజుకోవడంతో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన అన్ని లింకులు ట్విటర్ యూట్యూబ్ ఇతర సోషల్ మీడియా సైట్‌ల నుంచి తొలగించడం జరిగింది.












Click it and Unblock the Notifications