హత్రాస్ ముసుగులో మతపరమైన అల్లర్ల కుట్ర- అమ్నెస్టీకి విదేశీ నిధులు- రంగంలోకి ఈడీ...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సామూహిక అత్యాచారంపై ఓవైపు ప్రజాగ్రహం కొనసాగుతుండగానే ఇందులో మతపరమైన అల్లర్లకు కుట్ర జరిగిందంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. యోగీ ఆరోపణలపై విపక్షాలు ఇప్పటికే విరుచుకుపడుతుండగా.. తాజాగా ఈ వ్యవహారంలో యోగీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు మరింత సంచలనంగా మారాయి. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన నిధులతో హత్రాస్ ఘటన తర్వాత మతపరమైన అల్లర్లకు కుట్ర జరిగిందంటూ బీజేపీ సర్కారు ఆరోపిస్తుండగానే.. ఇందులో తాజాగా భారత్ నుంచి వైదొలగిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పాత్ర ఉందంటూ ఈడీ దర్యాప్తుకు సిద్ధమవుతోంది.

హత్రాస్ నిరసనల వెనుక కుట్ర...
హత్రాస్‌లో దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా సాక్ష్యాలు మాయం చేసేందుకు పోలీసుల సాయంతో రాత్రికి రాత్రి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం పెల్లుబుకుతుండగా.. ఇప్పుడు యూపీలోని యోగీ సర్కారు ఈ నిరసనల వెనుక కుట్ర కోణం ఉందంటూ కొత్త వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. దేశంలో మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టేందుకు విదేశీ నిధులు అందాయంటూ సీఎం యోగీ స్వయంగా చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతోంది. యోగీ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో ఇదే ఆరోపణలతో యూపీ సర్కారు అఫిడవిట్ దాఖలు చేయడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు హత్రాస్ నిరసనల వెనుక నిజంగానే కుట్ర జరిగిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఆమ్నెస్టీ పాత్రపై ఆరోపణలు...
కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ భారత్‌లో తాజాగా కార్యకలాపాలు నిలిపేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధపై ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందుతోందంటూ కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. ఇదే వ్యవహారంలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేశాయి. ఇప్పుడు హత్రాస్ వ్యవహారంలోనూ ఆమ్నెస్టీ సంస్ధ పాత్రపై యోగీ సర్కారు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పలు ఆరోపణలు చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్ధ ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు తీసుకుంటూ దేశంలో మతపరమైన అల్లర్లకు కుట్ర చేస్తోందంటూ యోగీ సర్కారు తాజా అఫిడవిట్లో ఆరోపించింది. హత్రాస్ నిరసనలను అడ్డుపెట్టుకుని ఆమ్నెస్టీ ఈ కుట్రకు తెరలేపిందని యూపీ సర్కారు విమర్శలు చేస్తోంది.

హత్రాస్‌లో ఆమ్నెస్టీ పాత్రపై ఈడీ దర్యాప్తు..
హత్రాస్ నిరసనల కోసం ఇస్లామిక్ దేశాల నుంచి తమకు అందిన నిధులను ఆమ్నెస్టీ సంస్ధ ఖర్చు చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగబోతోంది. హత్రాస్ ఘటనపై యూపీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఈడీ దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఆమ్నెస్టీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. దీంతో పాటు యోగీ సర్కారు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు అంతర్జాతీయ స్ధాయిలో కుట్ర జరిగిందా అన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు చేయనుంది. ఓ ప్రైవేటు సంస్ద సాయంతో ఆమ్నెస్టీ ఈ కుట్రకు పాల్పడిందని ఇప్పటికే యూపీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. దీని ఆధారంగానే ఇప్పుడు ఈడీ దర్యాప్తు సాగబోతోంది.












Click it and Unblock the Notifications