పంజాబ్ లో ఉత్కంఠకు తెర-సిద్ధూ ప్రమాణస్వీకారానికి వస్తానన్న అమరీందర్
పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తో తీవ్రంగా విభేధిస్తూనే పీసీసీ ఛీఫ్ పదవి సంపాదించుకున్న నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ హాజరు కారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో ఆయన వచ్చేందుకు అంగీకరించారు.
పంజాబ్ కాంగ్రెస్ లో అమరీందర్, నవ్ జ్యోత్ సింగ్ ల మధ్య నెలకొన్న వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అమరీందర్ వ్యతిరేకిస్తున్నా సిద్ధూను పీసీసీ ఛీఫ్ గా అధిష్టానం నిర్ణయించింది. దీని తర్వాత కూడా సిద్దూ, అమరీందర్ కలుసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, కనీసం శుభాకాంక్షలు చెప్పుకోవడం కానీ జరగలేదు. దీంతో రేపు సిద్ధూ పీసీసీ ఛీఫ్ ప్రమాణస్వీకారానికి అమరీందర్ రాకపై ఉత్కంఠ నెలకొంది.

పంజాబ్ లో నెలకొన్న పరిస్దితుల నేపథ్యంలో తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్... అమరీందర్ తో మాట్లాడి సీద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని సూచించింది. దీంతో ఆయన అంగీకరించారు. సిద్ధూ ప్రమాణ స్వీకార ఆహ్వానాన్ని తాజాగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన కుల్జీత్ సింగ్ నగ్రా సీఎం అమరీందర్ కు అందించనున్నారు. అలాగే సీఎం అమరీందర్ ను సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ హరీష్ రావత్ దగ్గరుండి తీసుకురానున్నారు. ఈ మేరకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications