5 రోజుల్లో 5వేల కిలోమీటర్లు..భారత్ నుండి జింబాబ్వేకు..
మణిపూర్ నుండి ఆఫ్రికాకు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి మూడు అమూర్ ఫాల్కన్లు. మణిపూర్ లో శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చిన మూడు అమూర్ ఫాల్కన్‌లు అపాపాంగ్, అలాంగ్, అహు.. భారత్ నుండి దక్షిణాఫ్రికాలోని తమ శీతాకాల నివాసాలకు చేరుకొని రికార్డు సృష్టించాయి. ఈ సుదూర యాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 5 రోజుల్లో 5వేల కిలోమీటర్లు ఈ పక్షులు ప్రయాణించాయి.
అపాపాంగ్ అనే అమూర్ ఫాల్కన్ నవంబర్ నెలలో కేవలం 6 రోజుల్లో 6,100 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. అరేబియా సముద్రం దాటుకుంటూ నేరుగా కెన్యా చేరుకున్న ఈ పక్షి.. డిసెంబర్ చివరి నాటికి జింబాబ్వే రాజధాని హరారే మీదుగా ఎగురుతూ కనిపించింది. తాజాగా ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు 'ఎక్స్'లో ఈ వివరాలను పంచుకున్నారు. నారింజ గుర్తు గల అపాపాంగ్ నవంబర్ లో ఆరు రోజుల్లో నిరాటంకంగా 6,100 కిలోమీటర్లు ప్రయాణించిందన్నారు. భారత్, అరేబియా సముద్రం, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మీదుగా కెన్యాకు చేరిన ఈ పక్షి.. చిన్న రాప్టార్ జాతిలో సుదూర నిరంతరాయ ప్రయాణ రికార్డుల్లో ఒకటిగా నిలిచింది.
పసుపు గుర్తు గల అలంగ్ 5,600 కిలోమీటర్లు పయనించి, తెలంగాణ, మహారాష్ట్రలలో ఆగి గత నెలలో కెన్యాకు చేరింది. ఇక ఎరుపు గుర్తుగల ఆహు బంగ్లాదేశ్ దాటి, అరేబియా సముద్రం మీదుగా 5,100 కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు చేరుకుంది. ఈ అద్భుత ప్రయాణాలు వాటి ప్రతిభ, సాహసానికి మారు పేరని మరోసారి రుజువైందని అధికారులు చెబుతున్నారు. వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్త సురేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ పక్షులకు శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చారు. వీటి ద్వారా పక్షుల వలస మార్గాలను, వాటి ఓర్పును శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.

ఈ ప్రయాణాలు ప్రపంచ పర్యావరణ వ్యవస్థల అంతర్భాగ సంబంధాన్ని, వలస మార్గాల సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. బోట్స్ వానాలోని ఓకావాంగో డెల్టా, సోమాలియాలోని క్సాఫూన్ లకు అవి చేరడం, పక్షుల ఓర్పుపై, ప్రపంచ సంరక్షణ ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతోంది.
ఈ వార్షిక వలసలు పక్షి ప్రేమికులను, సంరక్షకులను ప్రేరేపిస్తూ, మార్గాలను రక్షించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తాయి. వలస జాతులను కాపాడేందుకు సరిహద్దులు లేని విధానాలు, దేశాల మధ్య సహకారం అత్యవసరమని ఈ పక్షుల పయనం స్పష్టం చేస్తుంది.












Click it and Unblock the Notifications