'జయ అసలు బతికున్నారా లేదా.. నిజం చెప్పండి': మోడీకి శశికళ పుష్ప విజ్ఞప్తి
అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప సోమవారం నాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన స్పందించారు. జయ ఆరోగ్యం విషయంలో పారదర్శకత కావాలని ఆమె డిమాండ్ చేశారు.
చెన్నై: అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప సోమవారం నాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన స్పందించారు. జయ ఆరోగ్యం విషయంలో పారదర్శకత కావాలని ఆమె డిమాండ్ చేశారు. జయ ఎలా ఉన్నారో వాస్తవాలు వెల్లడించాలని అభిప్రాయపడ్డారు.
అలాగే, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చోసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జయలలిత బతికి ఉన్నారా లేరా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారన్నారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి పారదర్శకత కనిపించడం లేదని వాపోయారు.

అపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. అమ్మ పైన కొందరు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమిళ ప్రజలే ఆమె కుటుంబమని, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని చెప్పారు. జయ ఆరోగ్యం కొంచెం మెరుగుపడిన తర్వాత విదేశాల్లో లేదా ఎయిమ్స్‌లో చికిత్స చేయించాలన్నారు.
కాగా, జయలలిత చికిత్స పొందుతున్న చెన్నైలోని అపోలో ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
దీంతో ఆస్పత్రికి వచ్చే అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. కొద్దిదూరంలోనే బారికేడ్లు ఏర్పాటుచేసి కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. కొందరు కార్యకర్తలు ఆస్పత్రిలోనికి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications