ఇరాక్ నుంచి క్షేమంగా రప్పిస్తాం: సుస్మా, ఎన్నారైల కోసం ‘మదద్’
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసించే భారతీయుల(ఎన్నారై) దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు మదద్ (సహకారం) అనే ఈ-పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. భారత సంతతికి చెందిన వారి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారానికి జవాబుదారీగా ఉండేలా రూపొందించిన ఈ-పోర్టల్‌ను
విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రారంభించారు.

సమస్యలకు పరిష్కార ప్రక్రియను ప్రజలు సులువుగా తెలుసుకునే విధంగా ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. ఫిర్యాదుదారుల పర్యవేక్షణకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, గౌహతి లాంటి నగరాల్లోని విదేశాంగశాఖ విభాగాల ప్రధాన కార్యాలయాలకు ఈ పోర్టల్ అనుసంధానంచేసినట్లు అధికారులు తెలిపారు.
ఇరాక్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కిన 39 మంది భారతీయుల క్షేమ సమాచారం తెలియదని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. అయితే వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె హామీనిచ్చారు. గత జూన్‌లో ఉగ్రవాదులకు బందీలుగా చిక్కినవారి బంధువులతో ఆమె సమావేశమైన సందర్భంగా సుష్మాస్వరాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications