రూ.200 కోట్ల పాము విషం సీజ్: ఆరా తీసి, అరెస్ట్
కోల్‌కతా: రూ.200 కోట్ల విలువైన పాముల విషాన్ని తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతంలో నలుగురు అనుమానితులు సర్ప విషాన్ని కంటెయినర్లలో స్మగ్లింగ్ చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది.
అధికారులు కొనుగోలుదారులుగా వారి వద్దకు వచ్చారు. ఎంత విషం అమ్ముతున్నారన్న విషయాలను ఆరా తీశారు. మొత్తం అయిదు కంటెయినర్లలో విషం ఉన్నట్లు తెలియడంతో కంటెయినర్లను, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విషాన్ని ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా సిలిగురికి తీసుకొచ్చినట్లు గుర్తించారు.

తాము నిందితుల నుంచి మందుగుండు సామాగ్రి, రివాల్వర్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో సుజోయ్ కుమార్ దాస్, బిపుల్ సర్కార్, పింటూ బెనర్జీలు ఉన్నారని, వీరు దినాజ్‌పుర్ జిల్లాకు చెందిన వారని, మరో నిందితుడు అమల్ నుబియా.. మాల్దా జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. వారిని శనివారం నాడు జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.
నిందితులు ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్లో ఉండవచ్చునని అన్నారు. ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా పాము విషం కొన్ని బుల్లెట్ ప్రూఫ్ కంటెయినర్లలో వస్తుందని తమకు సమాచారం అందిందని చెప్పారు. అక్కడి నుంచి ఐదింటిని సిలిగురికి తీసుకు వచ్చినట్లుగా తెలిసిందన్నారు.












Click it and Unblock the Notifications