రాజ్‌భవన్ నుంచి రాజకీయాల్లోకి తెలంగాణ మాజీ గవర్నర్
Tamilisai Soundararajan: తమిళిసై సౌందరరాజన్. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు. తెలంగాణ గవర్నర్‌గా అయిదు సంవత్సరాల పాటు పని చేశారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్‌గా సేవలను అందించారు. రెండు రోజుల కిందటే ఆమె తన ఈ రెండు పదవులకు రాజీనామా చేశారు. రాజ్ భవన్ నుంచి రాజకీయాల్లోకి పునఃప్రవేశించారు.
ఆమె స్వరాష్ట్రం తమిళనాడు. గతంలో తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. 2009 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చెన్నై నార్త్ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

2019 ఎన్నికల్లో కూడా తూత్తుకుడి నుంచి లోక్‌సభ బరిలో నిలిచారు. పరాజయం పాలయ్యారు. ఆ తరువాతే తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టారు తమిళిసై సౌందరరాజన్. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గవర్నర్, లెప్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండో రోజే తమిళిసై బీజేపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణకే చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువాను కప్పుకొన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అన్నామలై చేతుల మీదుగా పార్టీ ప్రాథమిక సభ్యత్వ కార్డును అందుకున్నారు.
ఈ ఎన్నికల్లో ఆమె మరోసారి తూత్తుకుడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంపై అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఆధిపత్యం కొనసాగుతోంది. 2009లో డీఎంకే, 2014లో ఏఐఏడీఎంకే విజయం సాధించాయి. 2019లో డీఎంకే అభ్యర్థిగా కణిమోళి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కణిమోళి పోటీ చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications