మాజీ సీఎం ఇక లేరు..101 ఏళ్ల వయసులో..!
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు కురువృద్ధుడు వీఎస్ అచ్యుతానందన్ ఇవాళ కన్నుమూశారు. 101 ఏళ్ల అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగ పనిచేశారు. అవిభాజ్య కమ్యూనిస్టు పార్టీలోని 32 మంది కీలక నేతల్లో ఆయన కూడా ఒకరు. పేదల నాయకుడిగా, కఠినమైన పాలకుడిగా, దీటైన విపక్ష నేతగా ఆయన పలు పాత్రల్లో రాణించారు. ఆయన మరణంతో సీపీఎంలో విషాద ఛాయలు నెలకున్నాయి.
కేరళ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సీనియర్ నేత, సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వెలిక్కకతు శంకరన్ అచ్యుతానందన్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కామ్రేడ్ వీఎస్, వీఎస్ గా ఆయన ప్రసిద్దులు. అనారోగ్యంతో బాధపడుతున్న అచ్యుతానందన్.. ఇవాళ తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు 101 సంవత్సరాలు.

కేరళలో మాస్ లీడర్ గా పేరున్న అచ్యుతానందన్.. 2019లో గుండెపోటు వచ్చిన తర్వాత నుంచీ ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ వచ్చారు. నెల క్రితం ఆయనకు మరోసారి గుండెపోటు రాడంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పైనే ఉన్నారు.ఇవాళ ఆరోగ్యం విషమించడంతో అచ్యుతానందన్ చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 1964లో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది నాయకులలో అచ్యుతానందన్ ఒకరు.

2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా, 1991-96 వరకూ, 2001-2006 వరకూ,2011-16 వరకూ మూడుసార్లు ప్రతిపక్ష నేతగానూ వీఎస్ అచ్యుతానందన్ పనిచేశారు. 1923లోని కేరళలోని అలప్పుజలో జన్మించిన ఆయన.. చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో టైలరింగ్ షాపులోనూ, పరుపుల తయారీ కర్మాగారంలోనూ పనిచేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి నాయకుడిగా నిరూపించుకున్నారు. 2006లో 82 ఏళ్ల వయసులో ఆయన లెఫ్ట్ ఫ్రంట్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంతో కీలక పాత్ర పోషించి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.












Click it and Unblock the Notifications