మాజీ ప్రధానికి కరోనా నెగెటివ్: 89 ఏళ్ల వయస్సులో మహమ్మారిపై స్ఫూర్తిదాయక విజయం
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరప్ బారిన పడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్.. కోలుకున్నారు. కొద్దిసేపటి కిందటే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ రావడం వరుసగా ఇది మూడోసారి. ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేకపోవడంతో డాక్టర్లు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మన్మోహన్ సింగ్ వయస్సు 89 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆయన కరోనాపై స్ఫూర్తిదాయ విజయాన్ని సాధించారని డాక్టర్లు పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. దీనితో ఈ నెల 19వ తేదీన ఆయన దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థలో చేరారు. ట్రౌమా కేర్ సెంటర్‌లో డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందించారు. ప్రతిరోజూ ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు. ఆయనకు నిర్వహించిణ నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. మూడుసార్లు నెగెటివ్ రావడంతో ఆయన కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ మధ్యాహ్నం ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మన్మోహన్ సింగ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. 89 సంవత్సరాల వయస్సులో ప్రాణాంతక కరోనా వైరస్‌పై ఆయన స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించారని, 10 రోజుల వ్యవధిలోనే కోలుకున్నారని ప్రశంసిస్తున్నారు. కరోనా నుంచి కోలుకోవడానికి ఆత్మస్థైర్యం అవసరమని చెబుతున్నారు. ఆత్మ స్థైర్యం, పౌష్టికాహారం, డాక్టర్ల సలహాలతో కరోనా వైరస్ నుంచి కోలుకోవచ్చని మన్మోహన్ సింగ్ నిరూపించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications