జూన్ 1 నుంచి ఉచిత బస్సు: సువేందు మాస్టర్ స్ట్రోక్: తృణమూల్ కు బిగ్ చెక్
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.
అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళల కోసం ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించింది. మహిళా సాధికారత, ప్రజా రవాణాను మరింత చేరువ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుండి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మహిళలు అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం, పశ్చిమ బెంగాల్ మహిళలందరూ ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. షార్ట్ రూట్, లాంగ్ రూట్లతో పాటు, అన్ని రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. పథకం అమలుకు డిజిటల్ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. ప్రస్తుతం దీనిపై వర్కవుట్ చేస్తోన్నారు రవాణా అధికారులు. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, ఫొటో, లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. మహిళలు తమ సంబంధిత బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ లల్లో ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ఆధార్, ఓటర్ ఐడీ, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు తప్పనిసరి. ఫొటోలను జత చేయాలి. స్మార్ట్ కార్డులు వచ్చే వరకు, మహిళలు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ఫోటో ఐడి అంటే ఆధార్ వంటివి చూపించి ఉచిత ప్రయాణం పొందవచ్చు. బస్సుల్లో కండక్టర్లు జీరో వాల్యూ టికెట్ లేదా థర్మల్ పేపర్ టికెట్లను జారీ చేస్తారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక శాఖ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించాయని ఈ నోటిఫికేషన్ వివరించింది.












Click it and Unblock the Notifications