• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Giant Goldcoin: జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు నిజాం రాజుల దగ్గర 12 కిలోల బరువైన బంగారు నాణెం ఉండేది. ఈ భారీ గోల్డ్ కాయిన్ ఇప్పుడు ఎక్కడ ఉందన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది.

కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ప్రాచీన నాణేల ప్రదర్శన జరిగింది. అక్కడ ఈ నాణెం ప్రతిరూపాన్ని ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో చూసిన బంగారు నాణేల మీద ఆసక్తి పెంచుకున్న ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ వీటి గురించి కొంత సమాచారం సేకరించారు. ఈ నాణెం ఇప్పుడు ఎక్కడ ఉందన్న అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో హెచ్‌.కె. షేర్వాని సెంటర్‌లో డక్కన్ స్టడీస్ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్నారు.

''ఆయనకు పార్సీ భాష అంటే ఎక్కువ మక్కువ ఉండేది. అందుకే ఆ నాణేలపై కూడా పార్సీ భాష కనిపించేది. ఈ నాణేలు వాడుకకు కాకుండా, బహుమతులుగా ఇవ్వడానికి చేయించారు. అందులో భాగంగా తయారు చేసిన వాటిలోవే సుమారు 1,000 మొహర్ల బంగారపు నాణేలు. ఈ నాణెం బరువు 11 కిలోల 193 గ్రాములు'' అని ఈ బంగారు నాణెం గురించి వివరించారు ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ.

1605 నుండి 1627 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన జహంగీర్ ఇలాంటి నాణేలను ముద్రించారు. ఆయనకు స్వతహాగా కళలపై ఇష్టం. తనదైన ముద్ర ఉండేలా, ప్రముఖులకు బహుమానాలు ఇవ్వడానికి ఆయన ప్రత్యేకంగా ఇలాంటి నాణేలు ముద్రించారు.

జహంగీర్

నాణెంపై కవితలు, వాక్యాలు...

ఈ నాణెం ఇరు వైపులా పార్సీ, అరబిక్‌లలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. అన్ని వాక్యాల్లోనూ జహంగీర్ పేరు ఉంటుంది.

నాణేనికి ఒకవైపు - Father of the victorious radiance of the faith Muhammad Jahangir emperor warrior, the face of die and gold receive a thousand kinds of honor, from the design of the name of Jahangir Shah son of Shah Akbar, it would not be strange if born from the marriage of die and fire, in his mint it receives its instant reward - అని పార్సీ భాషలో రాసి ఉంటుంది.

నాణెం మరోవైపు - Has been struck at the abode of the caliphate in Agra eighth regional year corresponding to Hijri year 1022, from the great gift of seeing his new born thousand mohur, the radiant vision delights itself one thousand times, may coinage and the khutba be in his famous name, so long as traces of coin and khutba exist in time - అని రాసి కనిపిస్తుంది.

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్ గార్గ్ తన పుస్తకంలో ఈ వివరణ రాసుకొచ్చినట్టు ప్రొఫెసర్ సల్మా ఫారూఖీ బీబీసీకి తెలిపారు.

కేవలం బంగారు నాణేలే కాకుండా, జహంగీర్ తన పాలనా కాలంలో ఇంకా అనేక నాణేలను ముద్రింపజేశారు. ఆనాడు రూపొందిన ఓ నాణెంపై ఒకవైపు జహంగీర్ బాసింపట్టు వేసుకొని సింహాసనంపై కూర్చొని ఉన్న చిత్తరువు కనిపిస్తుంది. పార్సీ లో "ఈ బంగారు నాణెం గౌరవనీయమైన రాజు జహంగీర్‌ని పోలి ఉండే చిత్రాన్ని తయారు చేసింది" అని రాసి ఉంటుంది.

నాణెంకు మరోవైపు, సూర్యుడిని రూపం ముద్రిస్తూ నాలుగు కోణాలుగా విభజించారు. పడమట వైపు, దీనిని అజ్మీర్‌లో, ఇస్లామిక్ కాలమానం ప్రకారం 1023లో ముద్రించినట్టు రాసి ఉంటుంది. కుడివైపు 9వ సంవత్సరం అని రాసి ఉంటుంది. దాని మీద ఇంకా "Jahangir" and "Allahu Akbar" are equal in value till the Day of Judgement' అని పార్సీభాషలో రాసి ఉంటుంది.

జహాంగీర్ ఇలాంటి 12 కేజీల నాణేలు ఎన్ని చేయించారు?

ఈ భారీ నాణేలను మారకం కోసం కాకుండా అలంకరణ, బహుమానాల కోసం ఉపయోగించేవారు. ఇలానే వెయ్యి మొహర్లతో చేసిన ఒక నాణేన్ని అప్పటి ఇరాన్ దేశపు రాయబారికి ఇచ్చారు జహంగీర్. ఆత్మకథ "తుజుకే - జహాంగీరి"లో 1,000 తులాల బంగారు నాణెం ఒకటి యాద్గార్ అలీకి బహుమతిగా ఇచ్చానని రాసుకున్నారు.

ఈ యాద్గిర్ అలీ అప్పటి ఇరాన్ చక్రవర్తి దూతగా ఆగ్రా వచ్చారు. అక్బర్ మరణానికి సంతాపం తెలియజేయడానికి వచ్చినప్పుడు ఆయనకు ఈ బంగారు నాణెం బహూకరించి పంపించారు జహంగీర్.

ఇలాంటి నాణేలు జహంగీర్ తనకు ఆప్తులకు, ప్రముఖులకు, విదేశీ రాయబారులకు, తమ సేవలతో ఆయనను మెప్పించిన వారికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముద్రించారనేది చరిత్రకారుల మాట. మరి కొంతమంది విధేయులకు, వారి తలపాగాపై దీన్ని అలంకరించుకునేలా కాస్త చిన్న సైజు నాణేలు కూడా ముద్రించి ఇచ్చారు జహంగీర్.

డి.పంత్ తన పుస్తకంలో దీని గురించి వివరించారు. "జహంగీర్ తన కాలంలో తన రాణి పేరుతో కూడా ఎన్నో నాణేలు ముద్రించారు. 100 తులాల బరువు గల నాణెం, నూర్ సుల్తానీ పేరుతో 50 తులాల నాణేలు, నూర్‌దౌలతా పేరుతో 20 తులాల నాణేలు, 1 తులం బరువు ఉండే నాణేలను నూర్ జహానియా పేరుతో ముద్రించారు'' అని వివరించారు పంత్.

ఇప్పుడు చర్చలోకి వచ్చిన వెయ్యి మొహర్ల నాణేన్ని కౌకాబ్-ఏ-తాలి అని పిలిచేవారు. అంటే "ది రైజింగ్ స్టార్" అని అర్థం. దీని ప్రత్యేకత దాని బరువే. ఇదే పేరుతో అప్పట్లో 500, 200, 100 మొహర్ల నాణేలు కూడా చేయించారు. వీటిలో బంగారం, వెండి కూడా ఉన్నాయి అని పంత్ తన పుస్తకంలో తెలిపారు.

ఈ భారీ నాణేల గురించి విదేశీయులు తమ యాత్రాగ్రంథాలలో (travelogues) కూడా రాసారు. నికోలో మానుకి, కెప్టెన్ హౌకిన్స్ వంటి వారు ఇలాంటి పెద్ద పెద్ద నాణేలు జహంగీర్ కాలంలో ముద్రించినట్లు తమ పుస్తకాలలో రాశారు.

ఎన్ని నాణేలు మిగిలాయి?

అసలు ఇలాంటి నాణేలు ఎన్ని ఉన్నాయి అన్న దానిపై చాలా మంది చరిత్రకారుల్లో స్పష్టత లేదు. కానీ రెండు నాణేలు మాత్రం కచ్చితంగా ఉన్నాయని వీరు చెబుతున్నారు. వాటిలో ఒక నాణేన్ని ఇరాన్ రాయబారి అలీకి ఇచ్చారు జహంగీర్. మిగిలిన రెండవ నాణెమే ప్రస్తుత చర్చకు కారణం.

ఈ రెండవ నాణేన్ని జహంగీర్ మనుమడు, షాజహాన్ కొడుకు ఔరంగజేబు.. మొదటి నిజాం రాజు తండ్రికి ఇచ్చారనేది ఎక్కువ మంది చరిత్రకారుల అ‌‍భిప్రాయం. ఈ రెండిటిలో ఒకటి ప్రస్తుతం కువైట్‌లోని ఇస్లామిక్ మ్యూజియంలో ఉంది. బహుశా అదే ఇరాన్ రాయబారికి ఇచ్చిన కానుక అని చాలామంది చరిత్రకారులు చెబుతారు. కానీ నిర్ధారణ లేదు.

నాణేలపై పరిశోధన చేసే కాంతి కాంత్ సేవక్ ఇలాంటివి మూడు నాణేలు ఉండేవని చెబుతారు. అందుకే అవి అసలు రెండు నాణేలా, మూడు నాణేలా అన్న స్పష్టతలేదు.

"ఔరంగజేబు బీజాపూర్‌పై విజయం సాధించిన తరువాత అలసి పోయి ఉన్న తన సైన్యానికి ఆహారం అందించాలని కోరగా, సమయానికి ఆహారం అందించినందుకు గౌసుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జుంగ్‌కు బహుకరణగా 12 కేజీల బంగారు నాణెం ఇచ్చారు. మొదటి నిజాం (అసఫ్ జాహీ) రాజు నిజాం ఉల్ ముల్క్ తండ్రే గౌసుద్దీన్ ఖాన్. ఆ నాణెం చిట్ట చివరి ఏడవ నిజాం తరువాత ఆయన వారసుడు 8వ నిజాం వరకూ వచ్చింది'' అని కాంతి సేవక్ బీబీసీకి వివరించారు.

ప్రస్తుత వివాదానికి కారణమైన నాణేల ప్రదర్శనను కాంతి సేవక్ ఏర్పాటు చేశారు.

నిజాం నుంచి ఎక్కడికి వెళ్లింది?

ఏడో నిజాంతో అసఫ్ జాహీ రాజ్యం అంతరించి భారత ప్రభుత్వం వచ్చింది. ఆఖరి నిజాం మనుమడు అయిన ముఖరంజా దానిని తీసుకొని స్విట్జర్లాండ్ దేశం జెనీవాలోని ఒక బ్యాంకులో పెట్టారు. తరువాత అది వేలంలో అమ్ముడుపోయి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు చరిత్రకారులు సఫీయుల్లా చెబుతున్నారు .

"దీనిని హైదరాబాద్‌కే గర్వకారణమైన నాణెం అంటాం. ఎందుకంటే ఈ కాయిన్‌ని ఔరంగజేబు, హైదరాబాద్ నిజాం ముత్తాతలకు బహుమతిగా ఇచ్చారు. హైదరాబాద్ నిజాంల దగ్గర ఇది వారసత్వంగా ఎన్నో ఏళ్లు ఉండింది" అన్నారు కాంతి సేవక్.

1987 తరువాత 1995లో మళ్ళీ ఈ నాణెం విషయం చర్చలోకి వచ్చింది. అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఒక కథనం వచ్చింది. భారతదేశం మొఘులుల కాలం నాటి నాణేలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందనేది ఆ వార్త సారాంశం. వాటిలో ఒక నాణెం 12 కిలోల బరువు ఉండగా, మరొకటి కేజీ బరువు ఉందని, ఇవి రెండు ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్నాయని అందులో రాశారు.

ముఖరంజా స్విట్జర్లాండ్ బ్యాంకులో ఈ నాణేన్ని తాకట్టు పెట్టి, అప్పు తీర్చకపోవడంతో బ్యాంకు దాన్ని వేలం వేసింది. ఆ ప్రతిక కథనం ప్రకారం, ఆ నాణేనికి 8.7 మిలియన్ డాలర్ల విలువ కట్టారు. కానీ అంత మొత్తం పెట్టడానికి ఎవరూ రాలేదు.

హైదరాబాద్ నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్

న్యాయ వివాదం

ఆలోపు ఇలా ప్రాచీనమైన నాణేలను వేలం వేయడం నేరం అని అప్పట్లో భారతదేశానికి చెందిన సీబీఐ 1947 గోల్డ్ కంట్రోల్ యాక్ట్, అలాగే యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ యాక్ట్ కింద ముఖరంజా పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది.

స్విట్జర్లాండ్ నుండి ఆ నాణేలు తిరిగి తీసుకురావడానికి సీబీఐ 3 లేఖలు కూడా రాసింది. కాకపోతే స్విట్జర్లాండ్ కోర్టు తీర్పు భారత్‌కి వ్యతిరేకంగా వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో రాసింది.

ఈ విషయాన్ని బీబీసీతో ధ్రువీకరించారు డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్‌కి సంబంధించిన కోశాధికారి మొహమ్మద్ సైఫీయుల్లా.

"ముఖరంజా కి వారసత్వంగా వచ్చిన నాణేలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా అమ్మేశారు. స్విట్జర్లాండ్ న్యాయస్థానం కూడా భారత్ ప్రభుత్వం 1987లో వేసిన కేసును కొట్టి వేసింది. కోర్టు దీనికి వివరణ ఇస్తూ భారత్ దేశంలోని చట్టాలు స్విట్జర్లాండ్‌లో వర్తించవని చెప్పింది. అదే సమయంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత ఆ నాణెం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు, లేదా మ్యూజియంలలో ఉన్నట్టు ఆధారాలు లేవు కనుక అది భారత ప్రభుత్వ సొత్తు అనడానికి స్విట్జర్లాండ్ కోర్టు ఒప్పుకోలేదు. దీంతో బ్యాంకు వాళ్లు ముఖరంజా బకాయి నిమిత్తం ఆ నాణేన్ని అమ్మేశారు. ప్రస్తుతం అది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక మ్యూజియంలో ఉన్నట్టు అక్కడి నా స్నేహితులు కొందరు చెప్పారు'' అని సఫీయుల్లా బీబీసీతో అన్నారు .

వాస్తవానికి 100 ఏళ్లకు పై బడిన ఎలాంటి పురాతన వస్తువును అయినా అమ్మడం, కొనడం లేక విదేశాలకు పంపడం..యాంటిక్విటీ అండ్ ఆర్ట్ ట్రెజరర్స్ చట్టం ప్రకారం చట్ట విరుద్ధం. అయితే ఈ నాణెం భారత ప్రభుత్వం దగ్గర కాకుండా, నిజాం రాజు వారసుడి దగ్గర ఉండటంతో అది ప్రభుత్వ ఆస్తి అని నిరూపించలేక పోయింది భారతదేశం. దాంతో ఆ నాణెం తిరిగి అమెరికా నుంచి భారత్ రప్పించడం చట్టపరంగా అసాధ్యమనీ, భారత్ కావాలంటే దాన్ని తిరిగి కొనాలనీ చరిత్రకారుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Giant Goldcoin: Where is the 12 kg huge gold coin that came from Jahangir to the Nizam kings now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X