రెండేళ్ల క్రితం గ్యాంగ్ రేప్: వీడియో తీసి విక్రయం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్ల దళిత బాలికపై రెండేళ్ల క్రితం అగ్రవర్ణానికి చెందిన నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానికితోడు ఆ దురాగతాన్ని వీడియోలో చిత్రీకరించి మార్కెట్లో అమ్మేశారు. దీంతో బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆ తర్వాత క్రమంగా తేరుకుని ఆ కామాంధులపై న్యాయ పోరాటానికి సిద్ధపడింది.
2012లో 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటన నేపథ్యంలో బాలికను పాఠశాల నుంచి గెంటేయడం ఆమెను మరింత కుంగదీసింది. అయితే ప్రపంచంలో మహిళల దైన్యస్థితిపై శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో బాలిక ధైర్యం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

పాఠశాలలో ఉపాధ్యాయులు తనను నిందితురాలిగా పరిగణించారని, తన వల్ల ఇతర విద్యార్థులపై దుష్ప్రభావం పడుతుందని పాఠశాల నుంచి పంపించేశారని, ఫిర్యాదును వాపసు తీసుకోవాలంటూ గ్రామస్థులు కూడా తనపై ఒత్తిడి పెట్టారని ఆమె వివరించింది.
ఈ వ్యవహారంలో మొదట పోలీసులు తమకు సహకరించేందుకు నిరాకరించారని, అలాగే తమ న్యాయవాది కూడా నిందితుల నుంచి లంచాలు తీసుకుని సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలి తల్లి వెల్లడించింది. బాలిక సామూహిక అత్యాచారానికి గురైన వీడియోను మార్కెట్లో అమ్ముతున్నారన్న విషయాన్ని తట్టుకోలేక తన భర్త గుండెపోటుతో మరణించాడని తెలిపింది.












Click it and Unblock the Notifications