అక్కడ ఆ వేశాలు కుదరవు.. గోవాకు వెళ్లేవారు తెలుసుకోవాల్సిందే!
గోవా : ఏదైనా జాలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకునే యూత్ మదిలో ముందుగా మెదిలే ఆలోచన గోవా. అక్కడి బీచుల్లో ఫ్రెండ్స్ తో పాటు సిట్టింగ్ వేసి.. ఆ కిక్కులో ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే అలాంటివారందరూ ఈ వార్తను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇకనుంచి గోవాలో ఎక్కడపడితే అక్కడ తాగి తంథనాలు ఆడడం కుదరదు.
ఇందుకోసం కొన్ని ప్రాంతాలను 'నో ఆల్కహాల్ కన్సంప్షన్ జోన్స్' గా గుర్తించింది అక్కడి ప్రభుత్వం. కొన్ని జనావాసాలు, చారిత్రక వారసత్వ ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు ఉన్న చోట మద్యపానం సేవించడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గోవాను ఫ్యామిలీ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలనే యోచనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది గోవా ప్రభుత్వం.

నిబంధనలను అతిక్రమించినవారికి రూ.1000 నుంచి రూ.10 వేల వరకూ జరిమానా విధించనున్నారు అధికారులు. బీచుల్లోనే గాక బహిరంగ ప్రదేశాల్లోను, జాతీయ రహదార్ల పైననూ తాగుబోతుల వీరంగాలు ఎక్కువైపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. తాగిన మత్తులో చాలామంది అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. తాగి పడేసిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం కూడా కలుషితమవుతోందని ఈమధ్య చాలానే ఫిర్యాదులు అందాయి.
దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ చట్టాన్ని సవరించి నూతన నిబంధనలను అమలులోకి తీసుకొస్తోంది. కాగా, ఈ చట్టాన్ని బేఖాతరు చేసే మందుబాబులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications