వివాదాస్పద గురువు రాంపాల్ సోదరి సహా నలుగురు అరెస్ట్
ఛండీగఢ్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు బాబా రాంపాల్ సోదరితోపాటు మరో నలుగురిని పోలీసులు హిస్సార్‌లో సోమవారం అరెస్ట్ చేశారు. నవంబర్ నెలలో రాంపాల్ ఆశ్రమంలో పోలీసులకు, రాంపాల్ అనుచరులకు జరిగిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందిన ఘటనకు సంబంధించి వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాంపాల్ సోదరి రాజ్‌కళ, ఆమె ఇద్దరు సహాయకులు సావిత్రి, పూనమ్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హిస్సార్‌లోని జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాంపాల్‌ను శనివారం కలిసేందుకు వచ్చిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు రాంపాల్, దేశ్‌రాజ్‌లను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, రాంపాల్ కేసు వివరాలిలా ఉన్నాయి..2006లో రోహ్తక్ జిల్లాలోని కైన్‌తోలాలో ఉన్న స్వామీజీ ఆశ్రమంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి నమోదయిన హత్య కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిలును రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎం జయపాల్, దర్శన్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

కోర్టు ధిక్కరణ కేసులో బాబా రాంపాల్‌ను అరెస్టు చేసినట్లు, అందువల్ల ఆయన బెయిలును రద్దు చేయాలని పేర్కొంటూ హర్యానా అడ్వకేట్ జనరల్, బర్వాలా పోలీసు స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఒక దరఖాస్తును కోర్టులో దాఖలు చేసిన తర్వాత బెయిలును రద్దు చేశారు. ఆయనను తక్షణం అరెస్టు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అనారోగ్య కారణాలను చూపిస్తూ కోర్టు ముందు హాజరు కావడానికి నిరాకరిస్తూ వస్తున్న రాంపాల్‌ను నవంబర్ 19న వైద్య పరీక్షల కోసం పంచకులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్య వ్యవస్థలన్నీ నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్న తర్వాత పోలీసులు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.












Click it and Unblock the Notifications