భారత్‌లో లామ్డా వేరియంట్ వ్యాప్తికి ఆధారాల్లేవ్, కానీ కరోనా ముప్పు పోలేదు: వీకే పాల్
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ విజృంభించిన విషయం తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూలను ఎత్తివేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.

ఆ రెండు రాష్ట్రాల్లోనే 50 శాతానికిపైగా కరోనా కేసులు
దేశంలో గతవారంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా(53 శాతం) కేసులు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ, నీతి ఆయోగ్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మహారాష్ట్రలో 21 శాతం, కేరళలో 32 శాతం కేసులు నమోదయ్యాయని చెప్పారు.
జులై 8 నాటికి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 66 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 కంటే ఎక్కువగా నమోదైందని వీకే పాల్ వెల్లడించారు.ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కరోనా కొత్త కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందన్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోలేదు..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పాల్ స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, మాస్క్ ధరించకుండా ప్రజలు సంచరించడం ఆందోళనకు దారితీస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ తెలిపారు. కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు చెప్పారు. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు తెలిపారు. గర్భిణిలు కూడా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Recommended Video

దేశంలో లామ్డా వేరియంట్ గుర్తించలేదు
ఇప్పటికే పలు దేశాల్లో ఆందోళనలకు కారణమవుతున్న కరోనా లామ్డా వేరియంట్‌ను మనదేశంలో ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు వీకే పాల్. లామ్డా వేరియంట్ జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఇప్పటి వరకైతే భారత్‌లో లామ్డా వేరియంట్ వెలుగుచూసిందనడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. పెరూ దేశంలో 80 శాతం లామ్డా కేసులేనని చెప్పారు. సౌత్ అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో కూడా లామ్డా వేరియంట్ గుర్తించారని తెలిపారు. భారత ప్రభుత్వం, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కరోనా వేరియంట్ల వ్యాప్తి, పరిస్థితిపై దృష్టిసారించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications