పెట్రోల్ కష్టాలకు చెక్: ఇక మద్యంతోనే పరుగులు తీయనున్న కార్లు!
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్(E20) కంటే ఓ అడుగు ముందుకేసి.. 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం పెట్రోల్ ఉండేలా కొత్త నిబంధనలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ప్రభుత్వ వర్గాల్లో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరిందని.. మార్కెట్ టెస్టింగ్ కూడా ప్రాథమికంగా పూర్తయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల చెరకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారయ్యే ఆల్కహాల్ ఆధారిత ఇంధనమే భవిష్యత్తులో వాహనాలకు ప్రధాన వనరుగా మారనుంది.
దిగుమతుల తగ్గింపు - ఆర్థిక భరోసా
ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల కోసం 90 శాతం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దృష్ట్యా ఇంధన స్వయం సమృద్ధిని సాధించడం భారత్‌కు అత్యవసరం. ఈ పరిస్థితుల వల్ల ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఇంధన భద్రత కోసం భారత్ ఈ ఆల్కహాల్ ఆధారిత ఇంధనపై దృష్టిసారించింది. E85 ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసే స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించవచ్చు. ఇది రైతులకు తమ పంటలకు మంచి ధర లభించేలా చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల అవసరం
సాధారణ పెట్రోల్ ఇంజన్లు 85 శాతం ఇథనాల్‌ను తట్టుకోలేవు. అధిక ఆల్కహాల్ శాతం వల్ల ఇంజన్ భాగాలు తుప్పు పట్టడం లేదా సీల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, దీని కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రమే ఈ ఇంధనాన్ని వాడాల్సి ఉంటుంది. రాబోయే రెండేళ్లలో ఇటువంటి ఇంజన్లతో కూడిన వాహనాలను తయారు చేయాలని వాహన తయారీ సంస్థలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను ప్రదర్శించి, ఈ దిశగా సానుకూల సంకేతాలు ఇచ్చారు..
మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు సవాళ్లు
E85 ఇంధన వినియోగం కేవలం వాహనాలకే కాకుండా, అంతర్జాతీయ విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌లో కూడా కలిపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే దీని కోసం పెట్రోల్ బంకుల్లో విడిగా స్టోరేజ్ ట్యాంకులు, కొత్త నోజిల్స్‌ను ఏర్పాటు చేయడం ఓ పెద్ద సవాలు. అలాగే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉండటం వల్ల వినియోగదారుల్లో అవగాహన కల్పించడం కూడా ముఖ్యం. చమురు కంపెనీలు కూడా తమ మౌలిక సదుపాయాలను వేగంగా మార్చుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications