నెరవేరిన ఉద్యోగుల డిమాండ్, కొత్త పెన్షన్ పథకం ఖరారు - అమలు ముహూర్తం..!!
ఉద్యోగుల పెన్షన్ స్కీం పై కొత్త నిర్ణయం వెలువడింది. రెండు దశాబ్దాల కాలంగా కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం కాకుండా రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు దశాబ్దాల తరువాత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం దిశగా కీలక ప్రకటన చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు పెన్షన్ పథకం కొత్త విధానంలో అమలు చేయనున్నారు. దీని పైన స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయటంతో పాటుగా అమలు పైన స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయుల రెండు దశాబ్దాల డిమాండ్‌ను ప్రభుత్వం అమలు చేస్తూ ప్రకటన చేసింది. ఈ కొత్త పెన్షన్ పథకాన్ని సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. 'తమిళనాడు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్' ద్వారా పాత పెన్షన్ పథకం ప్రయోజనాలు దక్కుతాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా తీసుకునే జీతంలో యాభై శాతం అష్యూర్డ్ పెన్షన్ వారికి లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల 10 శాతం సహకారంతో పాటు పెన్షన్ నిధికి అవసరమైన మొత్తం అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.

కాగా, 50 శాతం అష్యూర్డ్ పెన్షన్ పొందే పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని కూడా పెంచుతామని సీఎం ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. ఒకవేళ పెన్షనర్ మరణించి నట్లయితే పెన్షన్ మొత్తంలో 60 శాతం మరణించిన వ్యక్తి నామినీకి కుటుంబ పెన్షన్‌గా మంజూరు చేస్తామని చెప్పారు.
ఇదే సమయంలో కొత్త పెన్షన్ పథకం ఇతర ప్రయోజనాలను సీఎం స్టాలిన్ వివరించారు. ఉద్యోగం లో ఉండగా లేదా పదవీ విరమణ సమయంలో మరణిస్తే సర్వీస్ ఆధారంగా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు డెత్ గ్రాట్యుటీ అందుతుందని తెలిపారు. కొత్త పెన్షన్ పొందడానికి అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు సర్వీస్ వ్యవధి పూర్తి చేయకుండా పదవీ విరమణ చేసినప్పటికీ కనీస పెన్షన్ అందిస్తామని చెప్పారు.
ఈ కొత్త పెన్షన్ పథకం కోసం పెన్షన్ నిధికి అదనంగా రూ. 13,000 కోట్లు ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కొత్త పెన్షన్ పథకానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సీపీఎస్ పైన ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. ఉద్యోగ సంఘాలతో చర్చించి.. అనువైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీ అమలు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications