కరోనా షాకింగ్: దగ్గాడని స్నేహితుడ్ని తుపాకీతో కాల్చేశాడు!
గ్రేటర్ నోయిడా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు తుమ్మినా, దగ్గినా వారిని దూరం పెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
గ్రేటర్ నోయిడాలో లూడో ఆట ఆడుతుండగా 25ఏళ్ల ఓ వ్యక్తి కావాలనే దగ్గుతున్నాడని గొడవ పెట్టుకున్న మరొకరు ఏకంగా అతడిని తుపాకీతో కాల్చేశాడు. జర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానగర్ ఆలయంలో మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రశాంత్ సింగ్ అలియాస్ ప్రవేశ్(25), జైవీర్ సింగ్ అలియాస్ గుల్లూ(30) దయానగర్‌లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా, మంగళవారం రాత్రి మరో ముగ్గురితో కలిసి వీరు లూడో ఆడుతున్నారు. ఆ సమయంలో అక్కడేవున్న ప్రవేశ్ దగ్గడంతో అతడితో వాగ్వాదానికి దిగారు గుల్లూ.
ఇద్దరి మధ్యా గొడవ ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ వెంట తెచ్చుకున్న తుపాకీ తీసి అతడిని కాల్చేశాడు. దీంతో ప్రవేశ్ గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కాల్పులకు తెగబడిన జైవీర్ సింగ్ తోపాటు ఆటలో పాల్గొన్న ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మరణాలు సంభవించాయి. మరో 51 మంది కరోనా నుంచి కోలుకున్నారు.












Click it and Unblock the Notifications