గుజరాత్ పోరు- ఆప్ జోరుతో కాంగ్రెస్ బేజారు ! హిందూత్వ, మోడీపై బీజేపీ ఆశలు !
ఈ ఏడాది డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దఫాలుగా జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే గత ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమం రూపంలో బీజేపీకి గట్టి సవాలు విసిరిన కాంగ్రెస్.. ఈసారి మాత్రం చతికిలపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ స్ధానాన్ని ఆక్రమించేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది.
2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ మార్కు అయిన 92కు కేవలం ఏడుసీట్లు ఎక్కువగా సాధించి 99వద్ద నిలిచింది. దీనికి కారణం కాంగ్రెస్ పటీదార్లు, ఓబీసీల్లో సాధించిన పట్టే. కానీ ఈసారి మాత్రం అది కనిపించడం లేదు. అన్నింటికీ మించి ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో నెగెటివ్ సెంటిమెంట్ కూడా కనిపించడం లేదు. దీంతో ఇదే అదనుగా బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ వరుసగా స్వరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తూ పార్టీలో జోష్ నింపుతున్నారు. ఇది నేను నిర్మించి గుజరాత్ అంటూ కనిపిస్తున్న మోడీ పోస్టర్లు ఇప్పుడు జనానికి ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు.

మరోవైపు ఈసారి ఉచిత విద్యుత్ తో పాటు ఉచిత చార్ థామ్ యాత్ర అంటూ ఆప్ గుప్పిస్తున్న హామీలు సాధారణ ప్రజల్ని కొంతమేర ఆకర్షిస్తున్నాయి. అయినా ఓటర్లు వీటికి లొంగే అవకాశాలు లేవని పరిశీలకులు చెప్తున్నారు. అయితే బీజేపీ నమ్ముకున్న హిందూత్వ రాజకీయాల్ని తిరిగి వారిమీద ప్రయోగించడం ద్వారా కేజ్రివాల్ ఆకర్షిస్తున్నారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తెస్తానంటూ కేజ్రివాల్ చేస్తున్న ప్రచారాన్ని అర్బన్ ప్రాంతాల్లో జనం నమ్మేలాగే ఉన్నారు. రాష్ట్రంలో ఆప్ దూకుడుతో కాంగ్రెస్ చతికిలపడుతోంది.

పార్టీ నుంచి దాదాపు డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేసినా పట్టించుకోకపోవడం ఆ పార్టీ పరిస్ధితిని చెప్పకనే చెబుతోంది. అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ ను టచ్ చేయకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్ లో అసెంబ్లీ పోరు సర్వేలు చెబుతున్నట్లుగా మరోసారి ఏకపక్షమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications