PM Surya Ghar: 9 లక్షల కనెక్షన్స్ దాటిన ఏకైక రాష్ట్రం! రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ పవర్..
భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడంలోనూ, గ్రీన్ ఎనర్జీ రంగాన్ని పరుగులు తీయించడంలోనూ గుజరాత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నాయకత్వంలో ఆ రాష్ట్రం రెన్యూవబుల్ ఎనర్జీ తయారీలో సరికొత్త మైలురాళ్లను అందుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన '2070 నాటికి నెట్-జీరో ఉద్గారాల సాధన', అలాగే '2030 నాటికి దేశీయ విద్యుత్ అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక వనరుల నుంచే పొందడం' అనే లక్ష్యాలకు గుజరాత్ వేగంగా బాటలు వేస్తోంది. 'పీఎం సూర్య ఘర్: ఉచిత విద్యుత్ యోజన' అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి సోలార్ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది.
లక్ష్యం 10 లక్షలు.. ఇప్పటికే 90 శాతం పూర్తి!
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంలో గుజరాత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా అమర్చిన మొత్తం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లలో ఏకంగా 18.21 శాతం ఒక్క గుజరాత్‌లోనే ఉండటం విశేషం. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో దాదాపు 9.08 లక్షల ఇళ్లపై 3,408 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లను అమర్చారు. మార్చి 2027 నాటికి 10 లక్షల ఇళ్లకు సోలార్ పవర్ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, గడువు కంటే ముందే ఇప్పటికే 90 శాతం లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించడం విశేషం.

పేద, గిరిజన కుటుంబాలకు బంపర్ ఆఫర్!
సాధారణ ప్రజలకు సోలార్ విద్యుత్ సులువుగా అందుబాటులోకి తెచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సబ్సిడీలను అందిస్తోంది. కేంద్రం ఇచ్చే సాయానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు ఆర్థిక సదుపాయాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 2.18 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటే కేవలం 5 శాతం నగదు చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వర్గాల ప్రజలు 10 శాతం వాటా చెల్లిస్తే చాలు. కేంద్ర సబ్సిడీ, వినియోగదారుడి వాటా మినహాయించి మిగిలిన వ్యయాన్ని గుజరాత్ ప్రభుత్వమే స్వయంగా భరిస్తోంది. అంతేకాక 6 కిలోవాట్ల వరకు డిజైన్ చార్జీలలో రూ.2,950 మినహాయింపు, నెట్‌వర్క్ స్ట్రెంథెనింగ్ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఉచితంగా నెట్ మీటరింగ్.. మిగిలిన కరెంట్ అమ్ముకునే వెసులుబాటు!
పాలసీలను ఎంతో సరళంగా మార్చడం వల్ల సామాన్యులు సోలార్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇళ్లపై వేసుకునే సోలార్ సిస్టమ్‌లకు ఎలాంటి 'కనెక్టెడ్ లోడ్' పరిమితులు లేవు. నెట్ మీటరింగ్ విధానం ద్వారా ఇళ్లలో వాడుకోగా మిగిలిపోయినదన విద్యుత్‌ను నేరుగా విద్యుత్ గ్రిడ్‌కే విక్రయించి డబ్బులు సంపాదించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. డొమెస్టిక్ వినియోగదారులకు ఎటువంటి బ్యాంకింగ్ చార్జీలు వర్తించవు. రూపాయి ఖర్చు లేకుంటే ఉచిత విద్యుత్ రావడమే కాకుండా అదనపు ఆదాయం కూడా వస్తుండటంతో గుజరాత్‌లోని ప్రతీ ఇల్లు ఇప్పుడు చిన్న స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారిపోతోంది.
దేశవ్యాప్త ఇంధన రంగంలో గుజరాత్ గర్జన!
కేవలం సోలార్ మాత్రమే కాకుండా అన్ని రకాల పునరుత్పాదక ఇంధన రంగాల్లోనూ గుజరాత్ సుదూరంలో నిలిచింది. రాష్ట్రంలో మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం 55,511 మెగావాట్లకు చేరింది. ఇది దేశ మొత్తం సామర్థ్యంలో 18.55 శాతానికి సమానం. సౌర విద్యుత్‌లో 36,234 మెగావాట్లతో దేశంలో 21.2 శాతం వాటాను, విండ్ ఎనర్జీలో 17,043 మెగావాట్లతో దేశంలో 28.8 శాతం వాటాను గుజరాత్ దక్కించుకుంది. ఈ గణాంకాలు చూస్తే గ్రీన్ ఎనర్జీ రేసులో గుజరాత్ అందనంత ఎత్తులో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications
