దీపావళి నాడు బాణాసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు తుది ఆదేశాలు: ఇకపై నో క్రాకర్ జోన్లు
ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ లో బాణాసంచా కాల్చడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిబంధనలతో కూడిన అనుమతులను మంజూరు చేసింది. గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. క్రాకర్స్ కాల్చడానికి టైమ్ ను సైతం నిర్ధారించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గణనీయంగా పడిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నెల 7, 8 తేదీలలో నిర్ణీత వేళల్లో మాత్రమే ఈ గ్రీన్ క్రాకర్లను ఉపయోగించాలని స్పష్టం చేసింది.. సుప్రీంకోర్టు. పర్యావరణ పరిరక్షణ, గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని సాధారణ బాణసంచాపై నిషేధం కొనసాగుతుండగా, తక్కువ రసాయన ఉద్గారాలను వెలువరించే హరిత బాణసంచాకు మాత్రమే సుప్రీంకోర్టు ఈ ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. పండుగ సమయాల్లో వాయు కాలుష్యం పెరగకుండా చూడటంలో భాగంగా సాధారణ బాణాసంచాపై నిషేధం విధించింది.

సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిర్దేశిత తేదీలలో అంటే ఈ నెల 7,8 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చడానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్ 15న సుప్రీంకోర్టు వెలువడించిన ఆదేశాలకు అనుగుణంగానే తాజా నిర్ణయం అమలులోకి వస్తుంది. నిబంధనలను అతిక్రమించి నిర్ణీత సమయం దాటిన తర్వాత బాణసంచా కాల్చడం చట్టరీత్యా నేరమని, నిర్దీత సమయాన్ని ప్రజలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు కొన్ని ఆంక్షలను విధించింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, సైలెంట్ జోన్లు, విద్యాసంస్థల చుట్టూ 300 మీటర్ల పరిధిలో ఎలాంటి బాణసంచా కాల్చకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆయా ప్రాంతాల్లో గ్రీన్ క్రాకర్స్ కాల్చడం కూడా నిషేధమే. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులు, చిన్నారులు, వృద్ధులకు ధ్వని, పొగ వల్ల అసౌకర్యం కలగకుండా ఈ 300 మీటర్ల పరిమితి నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఈ ప్రాంతాలను నో క్రాకర్ జోన్లుగా ప్రకటించాలని, ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్థానిక అధికారులను ఆదేశించింది. విస్తృత ప్రచార కార్యక్రమాల ద్వారా ఈ ఆంక్షలపై పౌరుల్లో పూర్తి అవగాహన పెంపొందించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేలా సంబంధిత పోలీస్ శాఖ, స్థానిక పరిపాలనా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
